భక్తి విశ్వాసాలే భగవంతుడిని రప్పిస్తాయి
ఎవరైనా సరే కొన్ని సందర్భాల్లో స్నేహితుల కోసమో ... బంధువుల కోసమో నిరీక్షించవలసి వస్తుంది. అయితే వాళ్లు వస్తారనుకున్న సమయం దాటిపోతే, ఎదురుచూస్తూ కూర్చున్నవాళ్లు తీవ్రమైన నిరాశానిస్పృహలకు లోనవుతారు. మరికాస్త ఆలస్యమైతే తీవ్రమైన అసహనానికి గురై, వాళ్లే వస్తారులే అనుకుని తమ పనులు చూసుకోవడం మొదలుపెడతారు.
కానీ 'శబరి' మాత్రం శ్రీరామచంద్రుడి కోసం కొన్ని సంవత్సరాలపాటు ఎదురుచూసింది. 'భిల్ల' యువతి అయిన శబరి కొన్ని కారణాల వలన 'మతంగ మహర్షి' ఆశ్రమం గల ప్రదేశానికి చేరుకుంటుంది. ఆయన కారణంగా రాముడిపట్ల ఆమెకి కలిగిన భక్తి అంతకంతకూ పెరుగుతూపోతుంది. శ్రీరాముడు తమ ఆశ్రమానికి వస్తాడనీ .. ఆయనని దర్శించాలనే ఆమె కోరిక నెరవేరుతుందని చెప్పి మతంగమహర్షి శరీరాన్ని వదిలేస్తాడు.
ఇక ఆ రోజు నుంచి ఆమె రామచంద్రుడి రాకకోసం ఎదురుచూస్తూనే వుంటుంది. ఏ రోజుకారోజు ఆయన వస్తాడని ఆశ్రమాన్ని అలంకరించి .. వివిధరకాల ఫలాలను కోసి సిద్ధంగా వుంచేది. ఆయన రాని ఏ రోజున కూడా ఆమె అసహనానికి లోనుకాలేదు. మరుసటి రోజున తప్పక వస్తాడని అనుకుంటూ మరింత ఆశగా ఎదురుచూస్తుండేది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోవున్న ఎవరికైనా, అవతలివారు అసలువస్తారో .. రారోననే సందేహం కలుగుతూ వుంటుంది. కానీ అలాంటి సందేహం శబరికి కలగలేదు. అందుకు కారణం మతంగమహర్షి చెప్పిన మాటపట్ల ఆమెకి గల అపారమైన విశ్వాసం.
రాముడు వస్తాడని ఆయన చెప్పిన ఒకే ఒక్కమాట పట్ల విశ్వాసంతో ఆమె అన్ని సంవత్సరాలు నిరీక్షించింది. ఇక రామచంద్రుడి పట్ల ఆమెకి గల అసమానమైన భక్తి కారణంగా, ఆమెకి ఏ రోజున కూడా అసహనం కలగలేదు. మతంగమహర్షి మాట పట్ల ఆమెకిగల విశ్వాసం ... రామచంద్రుడిపట్ల ఆమెకిగల భక్తి ఆ స్వామిని అక్కడికి రప్పించాయి. రామచంద్రుడికి ఆతిథ్యమిచ్చే అదృష్టాన్ని శబరికి కలిగించాయి. ఆయన హృదయంలో ఆమెకి శాశ్వతమైన స్థానాన్ని కల్పించాయి.