దైవానికి ఇష్టం లేనిది ఇదే !

కొంతమంది చాలా నిదానంగా కనిపిస్తుంటారు. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా వాళ్లు తమపని తాముచేసుకుంటూ వుంటారు. దైవారాధన ... మూగజీవాలపట్ల ప్రేమ ... ఇతరులపట్ల సానుభూతి వీరిలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటానికి వీళ్లు ఇష్టపడరు. ఎవరైనా ఏదైనా సాయం కోరితే, తమకి చేతనైతే చేస్తారు ... లేదంటే చేసేవారిని చూపిస్తారు.

అయితే ఇలా సున్నితమైన మనసున్నవారికి కొంతమంది అమాయకులనే ముద్రవేస్తారు. లోకం పోకడ తెలియదంటూ వాళ్ల మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు. అయినా మారకపోతే .. ఇక వీళ్ళింతే అన్నట్టుగా వ్యవహరిస్తారు. వాళ్ల తీరును గురించి ఇతరుల ఎదుట విమర్శిస్తూ మాట్లాడతారు. మంచితనమనేది మనుషుల్లో కనిపించని గుణమన్నట్టుగా ప్రవర్తిస్తారు.

ఇలాంటి వారి వైఖరి వలన, సున్నితమైన మనసున్నవాళ్లు బాధపడుతుంటారు. అలాంటివాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే, తమకి కావలసింది అదేనన్నట్టుగా అవతలివాళ్లు రాక్షసానందాన్ని పొందుతుంటారు. ఇలా మంచితనంపై మాటల దాడిచేయడం ... మానవత్వంగల మనుషులను బాధపెట్టడం మహాపాపమని చెప్పబడుతోంది. మంచివారిని బాధపెట్టడం వలన ఆ మంచితనం కారణంగానే వాళ్లు ఏమీ అనలేకపోవచ్చు. కానీ అలాంటివారిని మానసికంగా హింసించడం వలన, వారిని రక్షిస్తూ వస్తోన్న భగవంతుడు మాత్రం క్షమించడు.

ఇతరులకి సాయపడే మనస్తత్వమున్నవారిని భగవంతుడు కాపాడుతూ రావడం, అలాంటివారిని బాధించేవారిని శిక్షిస్తూ రావడం పురాణకాలం నుంచీ వుంది. మంచి చేయకపోయినా ఫరవాలేదు కానీ, మంచివారి పనులకు అడ్డుతగలడం ... వారిని మాటలతోను .. చేతలతోను హింసించడం చేయకూడదు. అలా కాదని తమదైన ధోరణిని కొనసాగిస్తే తగిన ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News