కోరిన వరాలనిచ్చే కొండంత దేవుడు
సదాశివుడు కొలువైన ప్రతి క్షేత్రం ఆయన మహిమలకు నిలయంగా కనిపిస్తూ వుంటుంది. లోకకల్యాణం కోసం ... మహర్షుల అభ్యర్థన మేరకు ... భక్తుల కోరిక మేరకు ఆయన అనేక ప్రదేశాల్లో ఆవిర్భవిస్తూ వచ్చాడు. ప్రేమానురాగాలతో పిలిస్తే చాలు మురిసిపోతూ అడిగిన వరాలను అందించాడు. అలాంటి క్షేత్రాలను అభివృద్ధి పరుస్తూ తమకిగల దైవభక్తిని రాజులు ప్రదర్శించారు. అలాంటి చారిత్రక నేపథ్యాన్ని కలిగిన క్షేత్రాల్లో ఒకటి 'దేవరకొండ'.
కృష్ణదేవరాయలవారిని ఆకర్షించిన 'ఖిల్లా'లలో దేవరకొండ ఒకటిగా కనిపిస్తుంది. దేవరయలవారి ప్రభావం వల్లనే ఈ కొండకి ఈ పేరు వచ్చిందని అంటారు. ఇక అప్పట్లో ఇక్కడి స్వామివారిని గిరిజనులు ఎక్కువగా సేవించేవారు. ఇక్కడి శివుడిని 'దేవరా' అని పిలవడం వారికి అలవాటు. అలా కూడా ఈ కొండకి దేవరకొండ అనే పేరు వచ్చి ఉంటుందని అంటారు. ఇలా ఈ క్షేత్రానికి గల పేరును గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తుంటాయి.
ఇక కొండపై ప్రాచీనకాలంనాటి శివాలయం ... రామాలయం దర్శనమిస్తుంటాయి. హరిహరుల లీలావిన్యాసాలకు నిలయంగా ఈ కొండ కనిపిస్తూ వుంటుంది. ఇక పట్టణంలోని 'భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి' ఆలయం కూడా ప్రాచీనమైనదే. సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను భక్తులు పెద్దసంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శిస్తూ వుంటారు.
దైవదర్శనం చేసుకునేవారిలో చాలామంది తమ కోరికలను అక్కడి దైవంతో చెప్పుకుంటూ వుంటారు. వాటిని భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని విశ్వసిస్తుంటారు. అలాంటి విశ్వాసం ఈ క్షేత్రంలో బలంగా కనిపిస్తుంది. వివిధరకాల సమస్యల వలన బాధలుపడుతోన్నవాళ్లు, దారిద్ర్యంతో అవస్థలుపడుతోన్నవాళ్లు స్వామివారికి తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. ఆయన అనుగ్రహంతో ఆ కష్టాల నుంచి బయటపడుతుంటారు. ఇలా నల్గొండ జిల్లాలోగల విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆదిదేవుడి లీలావిశేషాలకు నిలయంగా వెలుగొందుతోంది.