దైవారాధనలో దవనం ప్రాధాన్యత !
చైత్రశుద్ధ పాడ్యమి నుంచి తెలుగుసంవత్సరాది ఆరంభమవుతుంది. కొత్త సంవత్సరంలోగల మొదటి పదిహేనురోజులు ఎంతో విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు గల ఈ పదిహేను రోజులు దైవానుగ్రహాన్ని పొందడానికి మరింత అనుకూలమైనవి. ఈ రోజులలో జరిపే పూజాభిషేకాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి.
అలాంటి ఈ రోజులలో బ్రహ్మాదిదేవతలను ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సృష్టిరచన చేసే బ్రహ్మదేవుడిని 'పాడ్యమి' రోజున పూజించవలసి వుంటుంది. ఆ తరువాత సమస్త జీవుల మనుగడకు ఆధారభూతమైన సూర్యభగవానుడిని ఆరాధించాలి. సిరిసంపదలను అనుగ్రహించే లక్ష్మీనారాయణులను సేవించాలి. సౌభాగ్యాన్నీ ... మోక్షాన్ని ప్రసాదించే శివపార్వతులను కీర్తించాలి.
ఇక కొత్త సంవత్సరంలో తలపెట్టినకార్యాలకి ఎలాంటి ఆటంకం కలగకుండా వుండటం కోసం వినాయకుడిని పూజించాలి. ఎక్కడో కంటికి కనిపించని లోకాల్లో వుండే దైవాన్ని భూలోకానికి రప్పించి, మానవాళి క్షేమం కోసం వారు ఇక్కడ అర్చామూర్తులుగా ఉండేలా చేసిన మహర్షులను తలచుకోవాలి. ఇలా దేవతలను .. మహర్షులను కృతజ్ఞతా పూర్వకంగా పూజించాలి. అందుకు 'దవనం' ఉపయోగించాలని చెప్పబడుతోంది.
దైవారాధనలో దవనానికి ఎంతో ప్రాధాన్యత వుంది. చక్కని వాసనతో పాటు చల్లదనాన్ని ఇస్తాయి కనుక, చైత్రమాసం నుంచి వీటి వాడకం ఎక్కువగా వుంటుంది. వేసవి తాపాన్ని తట్టుకుని చల్లదనాన్నిచ్చే శక్తి దవనానికి వుంది. అందువలన భగవంతుడికి సమర్పించే పూలదండల్లో 'దవనం' చేరుస్తుంటారు. వేసవి తాపం నుంచి భగవంతుడికి ఉపశమనాన్ని కలిగించే దవనాన్ని ఆయన సేవలో ఉపయోగించడం వలన స్వామి ప్రీతి చెందుతాడని అంటారు. భగవంతుడికి ప్రీతిని కలిగించడంకన్నా భక్తులకు కావలసినది ఏవుంటుంది ?