ఆదిశేషుడిని అనుగ్రహించిన పరంధాముడు
ఆధ్యాత్మిక గ్రంధాలలోగల ప్రస్తావననుబట్టి, శ్రీమహావిష్ణువు పేరు వినగానే చిరుమందహాసంతో కూడిన ఆయన ప్రశాంత వదనం గుర్తుకువస్తుంది. శంఖు చక్రాలను ధరించిన ఆ స్వామి, పాలకడలిలో ఆదిశేషుడిపై సేదతీరుతూ వున్న దృశ్యం కనులముందు కదలాడుతుంది.
దేవతలు ... మహర్షులు శ్రీమహావిష్ణువు దర్శనభాగ్యం కోసం తపిస్తుంటారు. ఆ స్వామిని సేవించుకునే అవకాశం లభించడమే అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటిది ఆ స్వామి సేదతీరడానికి అవసరమైన పాన్పుగా ఆదిశేషుడు కనిపిస్తుంటాడు. ఆదిశేషుడి సమక్షంలోనే స్వామి లోకకల్యాణానికి అవసరమైన పథకరచనచేస్తూ వచ్చాడు. అందుకే ఆదిశేషుడు భాగ్యమే భాగ్యమని చెప్పుకుంటూ వుంటారు.
స్వామివారు భూలోకంలోని కొన్ని ప్రదేశాల్లో ఆవిర్భవించినప్పుడు, అక్కడ కూడా ఆదిశేషుడికి ఆయన ప్రత్యక్ష దర్శనమిచ్చాడు. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'తిరు ఊరగం' దర్శనమిస్తుంది. మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న 'కంచి' క్షేత్రంలో కామాక్షీ అమ్మవారి ఆలయానికి సమీపంలో ఈ ఆలయం అలరారుతోంది. స్వామివారు 'త్రివిక్రమమూర్తి' పేరుతోను ... అమ్మవారు 'అమృతవల్లి' పేరుతోను పూజలు అందుకుంటూ వుంటారు.
ప్రాచీనతను సంతరించుకున్న ఈ ఆలయం అనేక విశేషాలకు నిలయంగా కనిపిస్తూ వుంటుంది. పరమపవిత్రమైన ఈ క్షేత్రంలో స్వామివారు ఆదిశేషుడికి ప్రత్యక్ష దర్శనమిచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. అందువల్లనే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన కష్టాలు కరిగిపోతాయని చెబుతారు. అంకితభావంతో స్వామిని సేవించడం వలన అనుగ్రహాన్ని పొందుతారు. అలా స్వామివారి కటాక్షాన్ని పొందిన ఎంతోమంది భక్తుల అనుభవాలు ... ఆసక్తికరమైన కథనాలుగా ఇక్కడ వినిపిస్తుంటాయి. వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రదర్శనమే సమస్త పాపాలను హరించి వేస్తుంది. అనేక దోషాలను తొలగించి శుభాలను చేకూరుస్తుంది.