అదే ఉగాది గొప్పతనం !

ఒకానొక ప్రళయకాలం తరువాత బ్రహ్మదేవుడు తిరిగి సృష్టి చేయడం ఆరంభించిన రోజుగా 'చైత్రశుద్ధ పాడ్యమి' చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఈ రోజుని 'ఉగాది' పేరుతో తెలుగుసంవత్సరాదిగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది. ధర్మస్వరూపుడుగా ... అవతార పురుషుడుగా చెప్పబడుతోన్న శ్రీరామచంద్రుడు ఈ రోజునే పట్టాభిషేకం జరుపుకున్నాడు.

ఇక లోకకల్యాణం కోసం అనేక లీలలను ఆవిష్కరించిన కృష్ణపరమాత్ముడి అవతారకార్యం ముగిసి కలియుగం ఆరంభమైనది ఈ రోజునే. మహారాజుగా ప్రజల హృదయాలను చూరగొన్న విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్ఠించినది కూడా ఈ రోజేనేని చెప్పబడుతోంది. ఇలా చైత్రశుద్ధ పాడ్యమి అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది.

ఉగాది రోజున తీపి .. చేదు .. పులుపు .. ఉప్పు .. కారం .. వగరు అనే ఆరు రుచులతో పచ్చడిని తయారు చేసుకుని దానిని ప్రసాదంగా స్వీకరించడం ఆచారంగా వస్తోంది. ఈ రుచులకుగాను కొత్తబెల్లం .. వేపపూత .. చింతపండు .. ఉప్పు .. పచ్చిమిరప .. మామిడి ముక్కలను ఉపయోగించడం జరుగుతుంది. అలాంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం వెనుక, జీవితంలోని అన్నిరకాల పరిస్థితులను సమానంగా స్వీకరించాలనే ఉద్దేశం కనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఔషధంగా అనిపిస్తుంది.

ఉగాది నుంచి ఎండలు మరింత ముదురుతుంటాయి. శరీరం ఈ వేడిని తట్టుకోలేక అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. శరీరాన్ని చల్లబరిచి అనారోగ్యాల నుంచి విముక్తిని కల్పించేవిగా ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు కనిపిస్తుంటాయి. ఇలా ఉగాది అనేది ఇటు ఆధ్యాత్మికపరమైన ఆహ్లాదాన్నీ ... అటు ఆరోగ్యపరమైన మేలును చేకూర్చే పర్వదినంగా తన ప్రత్యేకతను చాటుకుంటూ వుంటుంది. కొత్తదనానికి ప్రతీకగా నిలుస్తూ సరికొత్త జీవితాన్ని ఆస్వాదించమని ఆశీర్వదిస్తూ వుంటుంది.


More Bhakti News