ఆంజనేయుడి ఆశీస్సులు చాలు
ఖమ్మం జిల్లా పరిధిలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు దర్శనమిస్తూ వుంటాయి. వాటిలో ఒక్కో క్షేత్రం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రామాలయాలు ... హనుమంతుడి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. వనవాస కాలంలో సీతారాములు ఈ ప్రాంతంలో సంచరించడమే ఇందుకు కారణమని చెబుతుంటారు.
ఈ క్షేత్రాల్లో ఇటు ఆధ్యాత్మిక నేపథ్యం గలవి ... అటు చారిత్రక వైభవం కలిగినవి వుండటం విశేషం. సీతారాములు నడయాడిన కారణంగానే పవిత్రమైనటు వంటి ఈ ప్రాంతంలో ఆంజనేయస్వామి స్వయంభువుగా అనేక చోట్ల ఆవిర్భవించాడని అంటారు. అలా ఆంజనేయస్వామి కొలువుదీరిన క్షేత్రాల్లో ఒకటి ఖమ్మంలో కనిపిస్తుంది. ఇక్కడి బ్రాహ్మణ బజారులో స్వామి ఆలయం అలరారుతోంది.
స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రదేశమంటే, స్వామి అక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడనే విశ్వాసం సహజంగానే బలంగా వుంటుంది. ఆ విశ్వాసం కారణంగానే ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ప్రతి మంగళవారం స్వామివారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడి హనుమంతుడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటే చాలు, మనోభీష్టం నెరవేరుతుందని చెబుతుంటారు.
స్వామివారికి చెప్పుకుని తలపెట్టినకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని భావిస్తుంటారు. శారీరకపరమైన ... మానసికపరమైన అనారోగ్యాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. గ్రహసంబంధమైన దోషాల నుంచీ ... దుస్వప్నాల బారి నుంచి విముక్తి కలుగుతుందని అంటారు. స్వామివారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుతూ ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.