స్నేహితుల అభిప్రాయాలను తెలుసుకోవాలి
సాధారణంగా కొంతమంది ఏదైనా ఒక వస్తువును కొనాలని అనుకున్నప్పుడు, ఆ వస్తువు మన్నికను గురించి తెలిసినవారిని అడిగి దానిని కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరికొందరు డబ్బుంది కదా ఇక ఎవరిని అడగవలసిన అవసరం ఏవుందిలే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు .. ఫలితంగా నష్టపోతుంటారు.
వస్తువుల విషయంలో ఇతరులను సంప్రదించకపోవడం వలన కలిగే నష్టం చాలా తక్కువనే చెప్పాలి. ఇక జీవితంలో ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు తమ మంచికోరే వారికి విషయాన్ని వివరించి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంటుంది. తన కన్నా ఎక్కువగా ఇతరులకు తెలిసే అవకాశం లేదనే అహంభావంతో నిర్ణయాలు తీసుకుంటే చివరికి చిక్కుల్లో పడక తప్పదు.
శ్రీరామచంద్రుడంతటివాడే సన్నిహితుల అభిప్రాయాలను తెలుసుకున్న తీరు కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. సీతాదేవిని రావణుడు అపహరించి తెచ్చిన నాటి నుంచి అతని తీరుని విభీషణుడు వ్యతిరేకిస్తూ వస్తాడు. రామలక్ష్మణులు వానర సైన్యంతో యుద్ధానికి వచ్చినప్పుడు కూడా, రావణుడి మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు. అయినా రావణుడు వినిపించుకోకపోవడంతో, శ్రీరాముడిని కలుసుకుని తనకి ఆశ్రయాన్ని కల్పించవలసిందిగా కోరతాడు.
విభీషణుడి మాటలను విశ్వసించి అతనికి ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అనే విషయంగా, హనుమంతుడు ... అంగదుడు వంటివారి అభిప్రాయాన్ని రాముడు అడుగుతాడు. ఆ తరువాతనే విభీషణుడికి ఆశ్రయాన్ని ఇస్తాడు. ఇలా రాముడంతటివాడే తన సన్నిహితుల అభిప్రాయాలను కోరాడు ... వాటికి విలువనిచ్చాడు. అందువలన సర్వం తమకే తెలుసుననే ధోరణిని వదిలి సన్నిహితుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వుండాలి. ఈ విధంగా చేయడం వలన కష్టనష్టాలకు దూరంగా వుండే అవకాశం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి.