చైత్రమాసంలో చేయవలసిన దైవారాధన

ప్రకృతి సౌందర్యం దేవతలను సైతం మంత్రముగ్ధులను చేస్తుంటుంది. అందువల్లనే నయనానందాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ప్రకృతి ఒడిలోనే వివిధ దేవతామూర్తులు ఆవిర్భవిస్తూ వచ్చారు. ఇక ఎలాంటి సమస్యలు వెంటాడుతూవున్నా, ప్రకృతి సౌందర్యాన్ని చూడగానే మనసుకి ప్రశాంతత లభిస్తూ వుంటుంది. అందుకే చాలామంది మనసు బాగోలేనప్పుడు మానసిక ప్రశాంతతను పొందడానికిగాను ప్రకృతి సౌందర్యం ఎక్కువగా గల ప్రదేశానికి వెళుతూ వుంటారు.

అందంగా కనిపించడం ఆహ్లాదాన్ని కలిగించడమే కాదు, జీవరాశికి అవసరమైన ఆహారాన్ని ప్రకృతి అందిస్తూ వుంటుంది. అలాంటి ప్రకృతి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే తీరు 'వసంత రుతువు' లో కనిపిస్తుంది. అందువలన ఇది తొలిరుతువుగాను .. నూతన సంవత్సరం ఆరంభంగాను చెబుతుంటారు. కొత్త సంవత్సరంలో తొలిమాసంగా 'చైత్రమాసం' కనిపిస్తుంది.

అలాంటి ఈ మాసంలో తొలి తిథి అయిన 'పాడ్యమి' రోజునే బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టినట్టుగా చెప్పబడుతోంది. అలాంటి విశేషాన్ని కలిగిన ఈ రోజునే 'ఉగాది' గా జరుపుకుంటూ వుంటారు. తెలుగువారి తొలి పండుగగా ... తెలుగుదనం నిండిన పండుగగా ఇది అనిపిస్తుంది. మానవాళికి ప్రకృతి అందించిన వరాలను ముందుగా భగవంతుడికి సమర్పించి ఆ తరువాత తాము స్వీకరించే కృతజ్ఞతా భావం ఇందులో కనిపిస్తుంది.

ఈ మాసంలోగల మొదటి పదిహేను రోజులలో ప్రతిరోజు విశేషమైనదేనని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ పదిహేను రోజులలో మొదటిరోజున సృష్టి రచనను ఆరంభించిన బ్రహ్మదేవుడిని ఆరాధించాలి. ఆ తరువాత వినాయకుడినీ ... పార్వతీ పరమేశ్వరులను ... లక్ష్మీనారాయణులను ... ఇష్టదేవతలను పూజించవలసి వుంటుంది. ఈ విధమైన దైవారాధన వలన నూతన సంవత్సరం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని చెప్పబడుతోంది. ఆయురారోగ్యాలు ... సంపదలు ... సంతాన సౌభాగ్యాలతో కూడినటువంటి ఆనందకరమైన జీవితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News