అలా శ్రీమహావిష్ణువు అనుగ్రహించాడు
కార్తవీర్యార్జునుడు మహాబల సంపన్నుడు. సహస్ర బాహుబల సంపన్నుడైన ఆయనని ఎదిరించి నిలిచే సాహసం ఎవరూ చేసేవారుకాదు. అలాంటి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయస్వామికి మహాభక్తుడు. అనునిత్యం దత్తాత్రేయస్వామిని పూజించనిదే ఆయన తన దినచర్యలను ఆరంభించేవాడు కాదు. తాను దత్తవ్రతాన్ని ఆచరించడమే కాకుండా, తన రాజ్యంలోని వాళ్లంతా ఆ వ్రతాన్ని జరుపుకునేలా చేయడం ఆయనకిగల దత్తభక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
మహాపరాక్రమవంతుడుగా కొనియాడబడిన ఆయన, నిజానికి సొట్ట చేతులు కలిగినవాడిగా జన్మిస్తాడు. రాజకుటుంబంలో పుట్టి .. నిస్సహాయుడిగా ఉండిపోవలసి వస్తుందని ఆయన ఎంతగానో బాధపడతాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన దత్తాత్రేయుడి పాదాలను ఆశ్రయించి, సహస్ర బాహుబలాన్ని పొందుతాడు. అయితే ఆయన సొట్ట చేతులతో జన్మించడానికీ, ఆ తరువాత సహస్ర బాహుబలాన్ని పొందడానికి కారణం శ్రీమహావిష్ణువు లీలావిశేషమేనని చెప్పబడుతోంది.
కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్ర రూపమని స్పష్టం చేయబడుతోంది. శ్రీమహావిష్ణువు చేతిలో గల సుదర్శనచక్రం, స్వామివారు సాధిస్తోన్న విజయాలకు తానే కారణమనే అహంభావానికి లోనవుతుంది. అది గ్రహించిన శ్రీమహావిష్ణువు .. శక్తిహీనుడవై జన్మించమని శపిస్తాడు. తన తప్పును మన్నించమంటూ సుదర్శనం ప్రాధేయపడటంతో స్వామివారి శాంతిస్తాడు. శక్తిహీనుడిగా జన్మించినప్పటికీ దైవానుగ్రహంతో పరాక్రమవంతుడివై ప్రశంసలను అందుకుంటావంటూ అనుగ్రహిస్తాడు.