వసంత నవరాత్రుల్లో చేయవలసిన పారాయణ
ఉగాది వస్తుందనే విషయాన్ని ప్రకృతి ముందునుంచే తెలియజేస్తూ వుంటుంది. మామిడి పిందెలు ... వేపపూత ... చెరుకు పంట ... కొత్తగా అంగడిలోకి అడుగుపెట్టిన బెల్లం ఇవన్నీ కూడా ఉగాదికి తమ సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. తెలుగుతనాన్ని అణువణువునా సంతరించుకుని, ఇటు ఆధ్యాత్మిక పరంగాను ... అటు ఆరోగ్యపరంగాను ప్రభావితం చేసేదిగా ఉగాది పండుగ కనిపిస్తుంది.
జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను కలిసి పంచుకోవాలనే సందేశాన్ని ఉగాది ఇస్తుంటుంది. సంప్రదాయం ... సంతోషం కలగలసినదిగా కనిపించే ఉగాదిలో, మొదటి తొమ్మిది రోజులు ఎంతో విశిష్టతను సంతరించుకున్నవిగా చెప్పబడుతున్నాయి. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ గల ఈ తొమ్మిది రోజులనే 'వసంత నవరాత్రులు' అని అంటారు. ఈ వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుడి ఆరాధన అత్యంత విశేషమైనదిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ తొమ్మిది రోజుల్లో సాయంత్రపు వేళలో చల్లనిగాలి వీస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ వుంటుంది. దీనిని రాములవారి గాలి అనీ ... తిరునాళ్ల గాలి అని జనం వాడుకలో చెప్పుకుంటూ వుంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు సీతారాములను పూజించడం వలన సమస్తపాపాలు ... దోషాలు పూర్తిగా నశిస్తాయి. అలాగే ఈ వసంత నవరాత్రులలో 'రామాయణం' పారాయణ చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ధర్మాన్ని రాముడు అనుసరించి .. ఆచరించి చూపాడు. అంతిమంగా ధర్మమే విజయాన్ని సాధిస్తుందని చాటిచెప్పాడు. అలాంటి రాముడిని ధర్మస్వరూపంగా ఆవిష్కరించినదే రామాయణం. ఈ కావ్యాన్ని చదవడం వలన తమని తాము సరిదిద్దుకునే అవకాశం కలగడమే కాదు, విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. అందువలన వసంత నవరాత్రులలో రామాయణాన్ని పారాయణ చేయాలని స్పష్టం చేయబడుతోంది.