దుష్టశక్తుల బాధలను నివారించే రుద్రాక్ష !
రుద్రుడి కన్నీటి బిందువుల నుంచి ఆవిర్భవించిన రుద్రాక్షలు ఎంతో మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి రుద్రాక్షలను నియమబద్ధంగా ధరించవలసి వుంటుంది. అత్యంత పవిత్రంగా వాటిని చూసుకోవలసి వుంటుంది. అప్పుడే అవి ఆశించిన ఫలితాలను అందిస్తాయి.
రుద్రాక్షలకిగల ముఖాలనుబట్టి ... వాటిని ధరించే స్థానాలనుబట్టి ... సంఖ్యనుబట్టి ఫలితాలు చెప్పబడుతున్నాయి. రుద్రాక్షలను ఆయా దేవతా స్వరూపాలుగా చెబుతుంటారు ... ఆయా గ్రహాల పాలనలో ఉన్నట్టుగా స్పష్టం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 'దశముఖి' రుద్రాక్ష 'విష్ణుస్వరూపం' గా తనదైన ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
ఈ రుద్రాక్షను ధరించినవారిపై నవగ్రహాల అనుగ్రహం వుండటం విశేషం. ఈ రుద్రాక్షను ధరించడం వలన పాపాల ఫలితంగా ... దోషాల కారణంగా వెంటాడుతోన్న దుష్టశక్తులు దూరమవుతాయి. కొన్ని దుష్టశక్తుల కారణంగా శారీరకపరమైన అనారోగ్యాలు ... మానసికపరమైన ఆందోళనలు కలుగుతుంటాయి. ఏదో తెలియని భయం వెంటాడుతూ వుంటుంది.
దుస్వప్నాల కారణంగా నిద్రపోవడానికి కూడా ఆందోళన చెందుతుంటారు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తూ కళావిహీనంగా కనిపిస్తుంటారు. అలాంటి పరిస్థితులలో దశముఖి రుద్రాక్షను ధరించడం వలన ఆశించిన ప్రయోజనం కనిపిస్తుందని అంటారు. దుష్టశక్తుల ప్రభావానికి లోనైనవారు ఈ రుద్రాక్షను ధరించడం వలన, అవి కలిగించే ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.