శివాభిషేకమే పాపాలను నశింపజేస్తుంది

శివుడి లీలావిశేషాలను పరిశీలిస్తే భక్తుల కోసం ఆయన పడిన ఆరాటం కనిపిస్తుంది. అమ్మమనసు ఆదిదేవుడిలోనే వుందనిపిస్తుంది. దేవతలు .. మహర్షులు .. అసురులు .. సాధారణ మానవులు .. ఇలా తనని అంకితభావంతో ఎవరు పూజించినా ఆయన కరిగిపోయాడు.

మార్కండేయుడి విషయంలో ఆయన యమధర్మరాజుపై విరుచుకుపడ్డాడు. కట్టెలు కొట్టి బతికే చిరుతొండనంబికి మోక్షాన్ని ప్రసాదించాడు. తన ఆలయాన్ని బాగుచేయించడానికి తిరుజ్ఞాన సంబంధర్ ... అప్పార్ పూనుకుంటే, అందుకు అవసరమైన ధనాన్ని స్వామి స్వయంగా అందజేశాడు. ఇక తన భక్తుడైన సుందరమూర్తి నాయనార్ కి దగ్గరుండి వివాహం చేశాడు.

ఇలా పరమశివుడి లీలావిశేషాలు జీవితకాలం పాటు తలచుకోవచ్చు. అలాంటి శివుడి మనసు గెలుచుకోవడానికి అభిషేకానికి మించిన సాధనలేదు. ఆలయాలలోను ... పూజామందిరాలలోను భక్తులు శివలింగానికి వివిధరకాల పూజాద్రవ్యాలతో అభిషేకం జరుపుతుంటారు. ఒక్కో అభిషేక ద్రవ్యం వలన ఒక్కో పుణ్యవిశేషం లభిస్తుందని చెప్పబడుతోంది.

అలా సదాశివుడు ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను అందిస్తుంటాడు. ఎవరి మనోభీష్టానికి తగినట్టుగా వారికి వరాలను ప్రసాదిస్తుంటాడు. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన జలంతో సదాశివుడికి అభిషేకం చేయడం వలన పాపాలు నశిస్తాయని చెప్పబడుతోంది. తెలిసీ తెలియక కొన్నిరకాల పాపాలకు కారణం కావడం జరుగుతూ వుంటుంది.

పాపాల ఫలితాలు వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుంటాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. జీవితంలో అవసరమైన అభివృద్ధిని సాధించడానికి అడ్డుపడుతుంటాయి. తీవ్రమైన నిరాశా నిస్పృహల్లోకి నెట్టేస్తుంటాయి. అలా బాధలకు గురిచేసే పాపాలన్నీ కూడా పరమశివుడిని స్వచ్ఛమైన జలాలతో అభిషేకించడం వలన పటాపంచలవుతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News