స్వప్న దర్శనమిచ్చే భగవానుడు

కృష్ణా జిల్లాపై కృష్ణానదితో పాటు కృష్ణభగవానుడి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కృష్ణుడి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఈ ఆలయాలలో ఎక్కువ శాతం ప్రాచీనకాలానికి చెందినవి కావడం విశేషం. బాలగోపాలుడిగా ... వేణుగోపాలుడిగా ... రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణుడుగా ఆయా ప్రదేశాల్లో స్వామి దర్శనమిస్తూ వుంటాడు.

అలా స్వామి కొలువుదీరిన విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'వేములమడ' కనిపిస్తుంది. ఈ గ్రామం కృష్ణాజిల్లా మొవ్వ మండలం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ రుక్మిణీ సత్యభామ సమేతంగా కృష్ణుడు దర్శనమిస్తూ వుంటాడు. స్వామి ఇక్కడ కొలువైనతీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ఒకానొక గ్రామం నుంచి స్వామివారి ప్రతిమ రహస్యంగా ఇక్కడికి తరలించబడిందని చెబుతారు. స్వామివారికి ఆలయాన్ని నిర్మిస్తూ వున్న సమయంలో, ఆ గ్రామంలో గల ఒక భక్తుడికి రుక్మిణీ సత్యభామలు స్వప్నంలో కనిపించారట. స్వామి ఎక్కడి నుంచైతే తీసుకువెళ్లారో ... అక్కడే తాము కూడా ఉన్నామనీ, తమని కూడా తీసుకువెళ్లి కృష్ణుడి సన్నిధిలో ప్రతిష్ఠించవలసిందిగా సెలవిస్తారు.

గ్రామస్తుల సహకారంతో ఆ భక్తుడు అలాగే చేస్తాడు. ఆ రోజు నుంచి స్వామివారు నిత్యపూజలందుకుంటూ ... తన మహిమలచే భక్తుల హృదయాలను దోచుకుంటూ వస్తున్నాడు. స్వామివారి అనుగ్రహంతో పాడిపంటలు వృద్ధిచెందుతాయనీ, సంతాన సౌభాగ్యాలు రక్షించబడుతూ ఉంటాయని అంటారు. అంకితభావంతో ఎవరైతే ఇక్కడి స్వామిని ఆరాధిస్తూ వుంటారో, అలాంటివారి కష్టాలను తొలగించడమే కాకుండా, స్వామి స్వప్న దర్శనమిస్తూ ఉంటాడని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News