అమ్మా అని పిలిస్తేచాలట !

అనంతమైన ఈ విశ్వంలో అమ్మప్రేమకి సాటిరాగలది లేదు. ఎంతగా ప్రేమానురాగాలను పంచేవారు ఉన్నప్పటికీ, ప్రతిఒక్కరూ తమకి కలిగిన బాధను ముందుగా అమ్మతోనే పంచుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే అమ్మ అందించే ఓదార్పు ఇంకెక్కడా లభించదు. దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు. అమ్మ ఆశీస్సులే రక్షణ కవచంలా బిడ్డను కాపాడుతూ వుంటాయి.

అలాంటి అమ్మలను కన్న అమ్మవారు, త్రిశక్తి స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అలా లక్ష్మీ .. పార్వతీ .. సరస్వతి కొలువైన ఆలయాలు ఆయా క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి. ఇకవారి ప్రతీకలుగా చెప్పబడుతోన్న శక్తిస్వరూపాల ఆలయాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి 'కమలాపురం' లో కనిపిస్తుంది.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ అమ్మవార్లు అంకమ్మ .. మద్దిరమ్మ .. లక్ష్మమ్మ పేరుతో పూజలు అందుకుంటూ వుంటారు. సువిశాలమైన ప్రదేశంలో ప్రత్యేక ఆలయాల్లో ఈ అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తూ వుంటారు. తరతరాలుగా ఇక్కడి అమ్మవార్లను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వస్తున్నారు.

తమ కష్టాలను ఆలకించేది ... ఆదరించేది అమ్మవార్లేనని ఇక్కడివాళ్లు బలంగా విశ్వసిస్తూ వుంటారు. అమ్మా అని పిలిస్తే చాలు, ఎలాంటి ఆపదలైనా ... ఇబ్బందులైనా వెంటనే తొలగిపోతాయని అంటారు. ప్రతి శుక్రవారమే కాకుండా ప్రతి ఏడాది ఇక్కడ జరిగే జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. అమ్మవార్లకి చీరసారెలు సమర్పిస్తుంటారు. వారి ఆశీస్సులు అందుకుని ఆనందంతో వెనుదిరుగుతుంటారు.


More Bhakti News