కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
ఫలాలు లేని చెట్టుకింద ఎవరైనా కాసేపు విశ్రాంతి తీసుకుని వెళుతుంటారు. ఇక కాయలు కాసే చెట్టయితే, వాటి కోసం రాళ్లను విసురుతుంటారు. గురితప్పిన రాళ్లు చెట్టుకొమ్మలకి కూడా గాయం చేస్తూనే వుంటాయి. సాధారణంగా పనులుచేసేవాళ్లే అందులోని కొన్ని పొరపాట్ల కారణంగా పైఅధికారులతో మాటపడుతూ వుంటారు. అసలు పనేచేయనివాళ్లు పొరపాటుచేసే అవకాశమేలేదు కనుక వాళ్లకి ఎలాంటి చీవాట్లు వుండవు.
చేసేవాళ్లకే చీవాట్లు అనుకునే ఈ సందర్భంలోనే, కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలని అనుకుంటూ వుంటారు. అలాగే అనునిత్యం భగవంతుడిని సేవించే భక్తులకే పరీక్షలు ఎదురైన సంఘటనలు ఎన్నో కనిపిస్తుంటాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించిన అన్నమయ్య .. తరిగొండ వెంగమాంబ .. హథీరామ్ బావాజీ వంటివారు పరీక్షలను ఎదుర్కున్నారు.
అలాగే రామచంద్రుడి పాదసేవకే తమ జీవితాన్ని అంకితం చేసిన తులసీదాస్ .. రామదాసు కూడా పరీక్షలను ఎదుర్కున్నారు. కృష్ణుడిని కీర్తిస్తూ సూరదాస్ ... ఆ స్వామిపట్ల అసమానమైన భక్తిశ్రద్ధలను ఆవిష్కరించిన కనకదాసు కూడా పరీక్షలను ఎదుర్కొనక తప్పలేదు. ఇక పాండురంగస్వామి లీలావిశేషాలను గానం చేస్తూ వచ్చిన పురందరదాసు .. జ్ఞానదేవుడు .. నామదేవుడు .. తుకారామ్ తదితరులు కొన్ని పరీక్షలకు నిలవవలసి వచ్చింది.
పరీక్షలకు దారితీసిన పరిస్థితులు ఏవైనా, ప్రతి పరీక్షలోనూ భక్తులే విజయాన్ని సాధించడం విశేషం. శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలను తట్టుకోవాలనే సత్యమే ఈ విషయంలోనూ కనిపిస్తుంటుంది. తనపట్ల గల విశ్వాసంతో ఆ దెబ్బలకు నిలచిన భక్తులను చూసుకుని భగవంతుడు మురిసిపోతుంటాడు. వాళ్ల సేవలను ఆనందంగా స్వీకరిస్తూ తనని తాను మరచిపోతుంటాడు.