అదే ఈ రుద్రాక్ష విశేషం !

నిత్యజీవితంలో చాలామంది వ్యాపారవ్యవహారాలు నిర్వహిస్తుంటారు. అయితే పెట్టుబడినిబట్టి ... అందులో పనిచేసే సిబ్బందినిబట్టి ఆ వ్యాపారం చిన్నదిగా ... పెద్దదిగా పరిగణించడం జరుగుతూ వుంటుంది. ఇక చిన్నవ్యాపారమైనా ... పెద్దవ్యాపారమే అయినా కావలసింది లాభాలు .. జరగవలసింది అభివృద్ధి.

వ్యాపారం ఏదైనా అది అంచెలంచలుగా పెరగాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం తమ పూర్తిసమయాన్ని కేటాయిస్తుంటారు. తమ వ్యాపారాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తుంటారు. అలాంటివారు 'షణ్ముఖి రుద్రాక్ష' ను ధరించడం వలన ఆశించిన ప్రయోజనం కనిపిస్తుందని చెప్పబడుతోంది. షణ్ముఖి అనగానే ఇది షణ్ముఖుడుగా పిలవబడుతోన్న సుబ్రహ్మణ్యస్వామి స్వరూపమనే విషయం అర్థమైపోతూనే వుంటుంది. అయితే కొంతమంది దీనిని వినాయకుడికి ప్రతీకగా కూడా భావిస్తుంటారు.

అలాంటి ఈ రుద్రాక్షను ధరించడం వలన, వ్యాపారాభివృద్ధి కోసం చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పబడుతోంది. ఈ రుద్రాక్ష పాలకుడు శుక్రుడు కావడం వలన, దీనిని ధరించడం వలన ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది. సాధారణంగా శుక్రుడు ప్రతికూలంగా వుండటం వలన, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వుంటుంది. షణ్ముఖి రుద్రాక్ష ధారణ వలన, ఆయన నుంచి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇలా షణ్ముఖి రుద్రాక్ష ధారణ వలన శుక్రగ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News