పరమాత్ముడు వేసిన పథకం అది !

శ్రీమన్నారాయణుడు ... కృష్ణభగవానుడిగా అవతరించి, భూలోకంలో ఆవిష్కరించిన లీలావిశేషాలు అన్నీఇన్నీకావు. దేవతలు .. దానవులు .. మహర్షులు సైతం ఆయన లీలలను ముందుగా తెలుసుకోలేకపోయారు. ఇక అసురల ఆటకట్టించే విషయంలో ఆయన చేసిన పథకరచన ఎవరినైనా ఆశ్చర్యచకితులను చేస్తుంది. 'కాలయవనుడు' అనే అసురుడి వృత్తాంతం అందుకు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.

కాలయవనుడి ఆగడాలకు అడ్డుకట్టవేయవలసిన సమయం ఆసన్నమైందని కృష్ణభగవానుడు భావిస్తాడు. అనుకున్నదే తడవుగా అతనితో యుద్ధానికి సిద్ధపడతాడు. అయితే యుద్ధం మధ్యలో కృష్ణుడు అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెడతాడు. అది ఆయన లీలావిశేషమని తెలియక, భయపడి పారిపోతున్నాడని భావించిన కాలయవనుడు, మరింత ఉత్సాహంతో అతని వెంటపడుతూ వుంటాడు.

కృష్ణుడు ఒక 'బిలం' లోకి వెళ్లి ఒక మూలన దాక్కుంటాడు. ఆ బిలంలో ఒక పక్కన ఒక వృద్ధుడు నిద్రిస్తూ వుంటాడు. బిలంలోకి ప్రవేశించిన కాలయవనుడు .. ఆ వృద్ధుడికి నిద్రాభంగం కలిగిస్తాడు. నిద్రలేచిన ఆ వ్యక్తి కళ్లు నులుముకుంటూ కాలయవనుడి వైపు చూస్తాడు. అంతే .. కాలయవనుడు అక్కడే భస్మమైపోతాడు.

అప్పటివరకూ అక్కడ నిద్రిస్తున్న వృద్ధుడు .. ముచికుంద మహర్షి. దేవతలకు ఎంతో సహాయకారిగా నిలిచిన ఆయన దీర్ఘనిద్రను వారి నుంచి వరంగా పొందుతాడు. అయితే ఎవరైనా తనకి నిద్రాభంగం కలిగిస్తే వారు ఎంతటి వారైనా, తన చూపుసోకగానే భస్మమై పోవాలనే వరాన్ని కూడా పొందుతాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు కావాలనే పథకం ప్రకారం ఆ బిలంలోకి కాలయవనుడు వచ్చేలా చేస్తాడు. అద్భుతమైన తన లీలావిశేషం చేత లోకకల్యాణానికి మరోమారు కారకుడవుతాడు.


More Bhakti News