అది అమ్మవారి మహిమేనట !
సాధారణంగా అమ్మవారు ఏ గ్రామంలో వెలసినా ఆ గ్రామస్తులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ వుంటారు. తమ బాగోగులను అ తల్లే చూసుకుంటుందని భావిస్తుంటారు. తమ సౌభాగ్యాన్నీ ... సంతానాన్ని ఆ తల్లే కనిపెట్టుకుని ఉంటుందనీ, పాడిపంటలను చల్లగా చూస్తూ ఉంటుందని విశ్వసిస్తుంటారు.
అలాంటి అమ్మవారు కొన్ని కారణాల వలన పూజాభిషేకాలకు దూరమైతే, ఆ తల్లి ఆ విషయాన్ని అక్కడివారికి గుర్తుచేసిన సందర్భాలు కనిపిస్తూ వుంటాయి. అలాంటి సంఘటనలు అమ్మవారి మహిమలుగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. అలాంటి సంఘటన ఒకటి మనకి ప్రకాశం జిల్లా 'కంభం'లో కనిపిస్తుంది. ఇక్కడి అమ్మవారు 'సత్యమాంబ' పేరుతో పూజలు అందుకుంటూ వుంటుంది.
చాలాకాలం క్రితం కొన్ని కారణాల వలన ఇక్కడి అమ్మవారు పూజలకు నోచుకోలేదట. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని అంటువ్యాధులు చుట్టుముట్టాయి. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా, పశువులు కూడా వ్యాధుల బారిన పడసాగాయి. దాంతో అమ్మవారికి ఆగ్రహం కలిగిందని గ్రహించిన కొంతమంది భక్తులు, మిగతావారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు.
అంతా కలిసి అమ్మవారి పాదాలను ఆశ్రయించి, ఆ రోజు నుంచే తిరిగి పూజాభిషేకాలు ఆరంభించారట. అంతే క్రమక్రమంగా అంటువ్యాధుల ప్రభావం తగ్గుతూ పోయింది. పాడిపంటలు కూడా ఆశించిన స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి అమ్మవారిపట్ల మరింత విశ్వాసం పెరుగుతూ వచ్చింది. అందుకు తగిన విధంగానే ఆలయ అభివృద్ధి జరుగుతూ వచ్చింది. ఆ తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైంది కనుక ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.