లక్ష్మీనారాయణుల పూజా ఫలితం
ఎవరి ఇంటి వాకిట్లో అనునిత్యం చక్కగా రంగవల్లులు దిద్దబడివుంటాయో .. ఏ ఇంటి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టబడి ఉంటాయో ... ఏ ఇంటి గడపకి పసుపు .. కుంకుమలు కనిపిస్తూ ఉంటాయో ఆ ఇంటిని చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది ... పవిత్రంగా కనిపిస్తుంది.
ఇంటిని చూసి .. ఇల్లాలిని చూడమనే నానుడి ప్రాచీనకాలం నుంచి వుంది. ఇల్లు చక్కగా తీర్చిదిద్దబడి కనిపించింది అంటే ఆ ఇల్లాలు పద్ధతిగలదనే విషయం తెలిసిపోతూనే వుంటుంది. ఆమెలోను లక్ష్మీకళ కనిపిస్తూనే వుంటుంది. ఇక వారి ఇల్లు మాదిరిగానే పూజా మందిరం కూడా కళకళలాడుతూ కనిపిస్తుంది. భగవంతుడు ఇక్కడే వున్నాడేమోనని అనిపిస్తుంది.
నిజంగానే ఇలాంటి ఇళ్లలోనే లక్ష్మీదేవి కొలువై వుంటుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే వుంటుందో అక్కడికి నారాయణుడు తరలివస్తాడు. ఇక లక్ష్మీదేవిని పూజిస్తూ వుండటం చూసి నారాయణుడు సంతోషపడతాడు. ఆ స్వామిని ఆరాధిస్తూ వుంటే అమ్మవారు ఆనందపడుతుంది. ఆ ఇద్దరికీ శుక్రవారం రోజున పూజాభిషేకాలు జరపడం వలన లక్ష్మీనారాయణులు మరింత ప్రీతిచెందుతారు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వలన జీవితంలో స్థిరపడటం జరుగుతుంది. లక్ష్మీదేవి చల్లని దయవలన సంపదలు పెరుగుతాయి ... సౌభాగ్యం రక్షించబడుతుంది.
ఎవరైతే లక్ష్మీనారాయణులను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ వుంటారో, వారిని ఆ స్వామి వాహనమైన గరుత్మంతుడు కూడా కనిపెట్టుకుని వుంటాడు. గరుత్మంతుడి అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు కలగడమే కాకుండా, తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజవంతంగా పూర్తవుతాయి. ఇలా లక్ష్మీనారాయణులను సేవిస్తూ వుండటం వలన ఆరోగ్యం ... ఐశ్వర్యం ... విజయం .. ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయే స్థిరమైన జీవితం లభిస్తుంది.