భగవంతుడు ఇలా ప్రీతిచెందుతాడు

అనంతమైన ఈ ప్రపంచంలో తాను ఒంటరిని అనే భావనతో కుంగిపోతూ నడుస్తోన్న సమయంలో దూరం నుంచి 'గుడిగంట' ధ్వని వినిపిస్తే చాలు ప్రాణం లేచొస్తుంది. తాను ఒంటరిని కాదు .. తనకి తోడుగా భగవంతుడు వున్నాడనే ధైర్యం కలుగుతుంది. అలాగే రాళ్ల దారిలో నడుస్తూ వస్తుండగా ఎదురుగా రకరకాల పూలు కనిపిస్తే, ఒక్కసారిగా నీరసం ఎగిరిపోయి ఉత్సాహం కలుగుతుంది.

ఆలయాలు ... అందమైన పూలచెట్లు ఎక్కడ వుంటే అక్కడ వాతావరణమే మారిపోతుంది. అడుగుపెట్టడంతోనే ఇవి ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. పూలు సంతోషాన్ని కలిగిస్తే .. ఆ పూలతో భగవంతుడికి చేసే పూజ సంతృప్తిని కలిగిస్తుంది. పూలతో చేసే అర్చన మాత్రమే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్లనే పూజ అనగానే ముందుగా పూలే గుర్తుకు వస్తుంటాయి.

అయితే ఈ పూలలో ఆయా దేవతామూర్తుల మనసు దోచుకున్నవి లేకపోలేదు. అలా శ్రీరామచంద్రుడికి ప్రీతికరమైన పూలలో సన్నజాజులు .. సంపెంగలు .. మందారాలు ముందువరుసలో కనిపిస్తుంటాయి. ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో అది కడవరకూ వాళ్లని కాపాడుతూ వుంటుందనే విషయాన్ని ఈ లోకానికి శ్రీరామచంద్రుడు స్పష్టం చేశాడు. ఇందుకోసం ఆయన అనేక కష్టనష్టాలను అనుభవించాడు.

అలాంటి శ్రీరామచంద్రుడు ప్రతి మనసులోనూ మందిరాన్ని నిర్మించుకున్నాడు. ప్రతి గ్రామంలోను ఆయన ఆలయం ... ప్రతి పూజా మందిరంలో ఆయన చిత్రపటం వుంటుంది. అలాంటి శ్రీరామచంద్రుడు అనునిత్యం అందరిచే పూజించబడుతుంటాడు. ఆ స్వామి పూజలో ఆయనకి ఎంతో ఇష్టమైన సన్నజాజులు .. సంపెంగలు ... మందారాలు ఉపయోగించడం వలన స్వామి ఆనందిస్తాడనీ ... అనుగ్రహిస్తాడని చెప్పబడుతోంది.


More Bhakti News