కష్టకాలంలో గుర్తుండవలసింది ఇదే !
జీవితం కష్టాలబాట పట్టకుండా సంతోషంగా ... సాఫీగా సాగిపోవాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అనారోగ్య సమస్యలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు ... వ్యాపారంలో నష్టాలు ... ఇతర కారణాల వలన కలిగే బాధలు ఇవన్నీ కూడా కష్టాల కిందికే వస్తాయి. ఆ మాటకొస్తే మనసుకి బాధని కలిగించే ప్రతిదీ కష్టమే. అలాంటి కష్టం ఎదురుకాకుండా జీవితం కొనసాగాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది.
చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. అలాగే కష్టమనేది ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. బాధలు పలకరించినప్పుడే ఆనందం విలువ తెలుస్తుంది. అయితే కొంతమంది చిన్నపాటి కష్టాలు ఎదురైనా డీలాపడిపోతుంటారు. వాటి బారినుంచి ఎలా బయటపడాలనే విషయంలో తీవ్రమైన ఆందోళనకి లోనవుతారు. ఓదార్చేవారుగానీ ... ధైర్యం చెప్పేవాళ్లుగాని లేకపోతే వీరి పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకోవాలి. లోకానికి వెలుగును .. వెన్నెలను అందించే సూర్యచంద్రులకు కూడా గ్రహణం పడుతుంది ... అదీ కొద్దిసేపే. అలాగే నిర్మలమైన ఆకాశం కనిపించకుండా కారుమబ్బులు కమ్ముకుంటూ వుంటాయి. అవి తేలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక రాత్రివేళ భయపెట్టే చీకటి .. ఉత్సాహంగా వచ్చే ఉదయాన్ని చూసి పారిపోతూనే వుంటుంది.
క్షీణిస్తూ వచ్చిన చంద్రుడు సైతం పౌర్ణమి నాటికి తిరిగి పూర్తిరూపాన్ని సంతరించుకుంటాడు. ఆకులన్నీ రాలిపోయిన చెట్టు కూడా తిరిగి చిగురిస్తూనే వుంటుంది. వెలుగు నీడలు ప్రకృతి ధర్మం ... సుఖదుఃఖాలు జీవనసత్యం అనే విషయాన్ని అర్థంచేసుకోవాలి. అప్పుడు కష్టాల తరువాత సుఖాలు పలకరిస్తాయనే ఆశాభావం కలుగుతుంది. దాంతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి అవసరమైన శక్తి చేకూరుతుంది.