వరాల నిలయం బాబా ఆలయం

శిరిడీ సాయిబాబా ఆలయాలు భక్తివిశ్వాసాలకి నిలయాలుగా కనిపిస్తుంటాయి. గురువారం వచ్చిందంటేచాలు గ్రామాల్లోను ... నగరాల్లోనూ బాబా ఆలయాల దగ్గర భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. తన సమాధి నుంచే తన సాయం అందుతూ ఉంటుందని బాబా సూక్తుల్లో కనిపిస్తూ వుండటం, ఆ మాటలు భక్తుల అనుభవాలుగా వెలుగులోకి వస్తుండటం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

బాబా ఆలయాల్లో అనునిత్యం నాలుగు హారతులు జరుగుతుంటాయి. అందువలన ఉదయం నుంచి రాత్రి వరకూ ఆయన ఆలయాల్లో సందడి కొనసాగుతూ వుంటుంది. అలాంటి బాబా ఆలయంలోకి అడుగుపెడితే .. 'ధుని' చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కొందరు .. సమాధి మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మరికొందరు కనిపిస్తుంటారు. ఒకవైపున బాబా లీలావిశేషాలను గురించిన పారాయణ ... మరోవైపున బాబా భక్తుల ధ్యానం కొనసాగుతుంటాయి.

ఇక గురువారాల్లో బాబా పల్లకీ సేవకి ఎంతో ప్రత్యేకత వుంటుంది. ఈ రోజున ఈ పల్లకీని మోసేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ధుని చుట్టూ ప్రదక్షిణ చేసి విభూతిని నుదుటున ధరించడం వలన, సమాధి మందిరానికి నమస్కరించడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయని అంటారు. ఇక బాబా లీలావిశేషాలను పారాయణ చేయడం వలన ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని చెబుతుంటారు.

బాబా పల్లకీని మోయడం వలన మనోభీష్టం నెరవేరుతుందని అంటారు. ఇందుకు నిదర్శనంగా తమ అనుభవాలను చెబుతుంటారు. పవిత్రతకు .. ప్రశాంతతకు ప్రతీకగా నిలిచే బాబా ఆలయాలు భక్తుల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయన కొలువైన మందిరాలు మహిమాన్వితమైనవిగా విలసిల్లుతున్నాయి.


More Bhakti News