భక్తుల వెన్నంటే బాబా ఉంటాడు
అందరూ తనవారే ... తానున్నదే అందరి కోసం అనుకునేవారు ఎంత సంతోషంగా ... సంతృప్తికరంగా ఉంటారనడానికి నిలువెత్తు నిదర్శనంగా శిరిడీ సాయిబాబా కనిపిస్తుంటాడు. తనని విశ్వసించేవారి పట్ల బాబా ప్రేమానురాగాలను కలిగి ఉండేవాడు. అలాంటివారి ఇంట లేమి అనేది లేకుండా చేసేవాడు. పూర్వజన్మలో చేసిన పాపాలు వారిని ఇబ్బంది పెడుతున్నాయని తెలిసి, వాళ్ల దగ్గర నుంచి దక్షిణగా రెండురూపాయలు తీసుకుని ఆ పాపాల ప్రభావాన్ని తగ్గించేవాడు.
తన భక్తులకు ఆపద పొంచి వుందని తెలిసి ముందుగానే వారించేవాడు. ఆయన మశీదులో ఉండగానే కాదు, సమాధి చెందిన అంతరం కూడా బాబా ఎంతోమందిని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడిన సందర్భాలు వున్నాయి. ఒకసారి ఒక వ్యక్తి పొరుగూరికి వెళ్లివస్తూ చీకటిలో యేరు దాటబోతూ వుండగా, ఒక వృద్ధుడు వచ్చి అతణ్ణి అడ్డుకుంటాడు.
పైన కురుస్తోన్న వర్షాల కారణంగా యేటి ఉధృతి పెరగనుందనీ, ఇప్పుడు దానిని దాటడానికి ప్రయత్నించడం ప్రాణాలకి ప్రమాదమని హెచ్చరిస్తాడు. వెనక్కి వెళ్లి ఆ రాత్రికి ఎక్కడైనా తలదాచుకుని మర్నాడు ఉదయాన్నే బయలుదేరడం మంచిదని చెబుతాడు. ఆ వ్యక్తి అలాగే వెనక్కివెళ్లి ఒక ఇంటి వసారాలో ఆ రాత్రి తలదాచుకుని మర్నాడు ఉదయం యేటి దగ్గరికి చేరుకుంటాడు.
ప్రస్తుతం దాని ఉధృతి తగ్గినా రాత్రి దాని స్థాయి తీవ్రంగా ఉందనే విషయం అక్కడి ఆనవాళ్లను బట్టి అతనికి అర్థమవుతుంది. క్షేమంగా యేరుదాటి ఇంటికి చేరుకుని రాత్రి తనని ఒక వృద్ధుడు వారించిన విషయాన్ని గురించి భార్య దగ్గర ప్రస్తావిస్తాడు. రాత్రి అతని కోసం తాను వాకిట్లో నుంచుని ఎదురు చూస్తూ వుండగా ఒక వృద్ధుడు వచ్చి, అతను పనిమీద పొరుగూరులోనే ఆగిపోయాడనీ .. మరునాడు ఉదయాన వస్తానని చెప్పమన్నాడంటూ వెళ్లిపోయాడని ఆమె అంటుంది.
తనని వారించినదీ ... తన భార్య ఆందోళన చెందకుండా చేసినది బాబానే అనే విషయం అప్పుడు అతనికి అర్థమవుతుంది. అదే విషయాన్ని ఆయన భార్యతోను చెబుతాడు. బాబా లీలావిశేషం తమకి కూడా అనుభవమైనందుకు ఆ దంపతులు సంతోషంతో పొంగిపోతారు. మనసులోనే బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.