కష్టాల్లో తోడుగా నిలిచే బంధువే బాబా

శిధిలావస్థలోగల మశీదులో ధుని ఎదురుగా బాబా కూర్చుని ఉండేవాడు. అప్పుడప్పుడు గోధుమలు విసురుతూ ఉండేవాడు. తనకి లభించిన భిక్షలో కొంతభాగం మూగజీవులకు పెట్టి, మిగతాది తాను తినేవాడు. ఆరంభంలో ఆయన గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటివారిని ఆకట్టుకోవడానికి బాబా ఎలాంటి విద్యలు ప్రదర్శించనూ లేదు.

బాబా చూపే ప్రేమానురాగాలకు శిరిడీ ప్రజలు కరిగిపోయారు. ఆవేదనతో నిండిన మనసుకి అమ్మ ఓదార్పుకి మించిన ఔషధం లేదు. ఆ ఓదార్పు వారికి బాబా వలన లభించింది. అండగా నిలిచే తండ్రిలా బాబా వారికి కనిపించాడు. అంతే వారిక బాబా పాదాలను విడిచిపెట్టలేదు. అలా విశ్వసించినవారిని బాబా వదులుకోలేదు.

తన భక్తులనే కాకుండా ఆ కుటుంబంలోనివారిని తరతరాలుగా కాపాడుకుంటూ రావడం బాబాలో కనిపిస్తుంది. అందువల్లనే ఊరూరా ఆయన ఆలయాలు నిర్మితమవుతూ వస్తున్నాయి. భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతున్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి 'లక్కవరం' లో కనిపిస్తుంది. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పరిధిలోకి వస్తుంది.

లక్కవరం గ్రామం చిన్నదే అయినా ఇక్కడే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోను ప్రాచీనకాలంనాటి ఆలయాలు అలరారుతున్నాయి. పురాతన కాలంనాటి వివిధ దేవతామూర్తుల శిలావిగ్రహాలు ఎన్నో ఇక్కడ వెలుగుచూశాయి. అందువలన ఈ గ్రామానికిగల స్థలమహాత్మ్యం విశేషమైనదని అంటూ వుంటారు. అలాంటి ఈ గ్రామంలో బాబా ఆలయం భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంది.

అనునిత్యం బాబా ఆలయంలో జరిగే హారతులు .. భజనలు, గురువారాల్లోను .. పర్వదినాల్లోను జరిగే ప్రత్యేక సేవలు బాబా పట్ల ఇక్కడి వారికి గల భక్తిశ్రద్ధలకు అద్దంపడుతుంటాయి. బాబా చల్లని మనసున్నవాడనీ, ఆయన దర్శనం వలన కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటారు. తనని విశ్వసించినవారికి దగ్గర బంధువుగా తోడుగా ఉంటూ, వాళ్లకి ఎలాంటి ఒడిదుడుకులు కలగకుండా చూస్తూ ఉంటాడని అంటారు. తమ జీవితాలను ఆయన ప్రభావితం చేసిన తీరును అనుభవాలుగా ఆవిష్కరిస్తుంటారు.


More Bhakti News