ఇక్కడి సూర్యభగవానుడిని పూజిస్తే చాలు
సూర్యభగవానుడు అనంతమైన ఈ విశ్వంలో అన్నివైపులకు వెలుగురేఖలను పరుస్తుంటాడు. ఆయన వస్తూ ఉంటేనే సమస్త ప్రకృతి తేజస్సుతో వెలిగిపోతుంది. ఆయన తన పని ముగించుకుని జారిపోతుంటే ప్రకృతి కూడా వాలిపోతుంది. సమస్త జీవకోటికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యభగవానుడు, ప్రాచీనకాలం నుంచి దేవతలు .. మహర్షులు ... మానవులచే పూజలందుకుంటూ వస్తున్నాడు.
తమకి జీవనాధారమైన సూర్యభగవానుడికి కృతజ్ఞతాపూర్వకంగా మానవాళి అనునిత్యం నమస్కరిస్తూ వుంటుంది. ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుడిని అనుదినం అంకితభావంతో పూజించేవాళ్లు ... ఆయన క్షేత్రాలను దర్శించేవాళ్లు ఎంతోమంది వున్నారు. అలా సూర్యభగవానుడు అర్చామూర్తిగా పూజాభిషేకాలు అందుకునే ఆలయం 'కాశీ' లో కనిపిస్తుంది.
విశ్వనాథుడు ... విశాలాక్షి నిత్యనివాసమైన కాశీలో, సూర్యభగవానుడు 'సాంబాదిత్యుడు' పేరుతో దర్శనమిస్తూ వుండటం విశేషం. ఇక్కడ సూర్యభగవానుడు ఈ పేరుతో పూజలు అందుకోవడం వెనుక పురాణపరమైన కథనం వినిపిస్తుంది. కృష్ణుడికీ జాంబవతికి జన్మించినవాడే సాంబుడు. ఒకానొక సందర్భంలో సాంబుడి ధోరణి కృష్ణుడికి తీవ్రమైన అసహనాన్ని కలిగించిందట ! ఫలితంగా కృష్ణుడి శాపానికి గురైన సాంబుడు కుష్ఠువ్యాధిగ్రస్తుడవుతాడు.
అయితే శాంతించిన కృష్ణుడు .. కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడ సూర్యభగవానుడిని ఆరాధిస్తూ ఉండటం వలన ఆ వ్యాధి నుంచి విముక్తి లభిస్తుందని చెబుతాడు. దాంతో సాంబుడు ఈ క్షేత్రానికి చేరుకుని ఇక్కడి సూర్యభగవానుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తాడు. ఫలితంగా ఆయన అనుగ్రహంతో ఆ వ్యాధి బారినుంచి బయటపడతాడు. సాంబుడు పూజించిన ఆదిత్యుడు కనుక ఈ స్వామిని సాంబాదిత్యుడు పేరుతో కొలుస్తుంటారు. కాశీ క్షేత్రమే మహా మహిమాన్వితమైనది. ఇక్కడ చేసే దానధర్మాలు ... జపతపాలు అనేకరెట్లు ఫలితాన్ని ఇస్తాయనడానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.