ఆయన శాపమే అందుకు కారణం !
కార్తవీర్యార్జునుడు అనునిత్యం అతిథులను ఆహ్వానించి వారికి భోజన వసతులు కల్పించేవాడు. అతిథులు భోజనం చేసిన తరువాతనే తాను భోజనానికి కూర్చునేవాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలితో వస్తాడు. అతనికి అతిథి మర్యాదలు చేయడానికి కార్తవీర్యార్జునుడు సిద్ధపడతాడు. వచ్చినది అగ్నిదేవుడు అనే విషయం ఆ సమయంలోనే అతనికి తెలుస్తుంది.
అయినా మనసు మార్చుకోకుండా అతను దహించి ఆకలి తీర్చుకోవలసిన భూభాగాన్ని చూపుతాడు కార్తవీర్యార్జునుడు. అగ్నిదేవుడు ఆ ప్రదేశంలో గల వనాలను ... అందులోని మృగాలను దహిస్తూ వెళుతుంటాడు. అలా దహిస్తూ వస్తోన్న మంటలను వశిష్ఠ మహర్షి చూస్తాడు. జరుగుతోన్న దహనానికి కారకుడు కార్తవీర్యార్జునుడు అనే విషయం ఆయనకి తెలిసిపోతుంది.
పచ్చని వనాలు ... వాటిని ఆశ్రయించిన మృగాలు ... పశువులు ... పక్షులు అన్నీ కూడా దహించబడుతూ వుండటం చూసిన వశిష్ఠమహర్షి ఆగ్రహావేశాలకి లోనవుతాడు. సహస్ర బాహుబల సంపన్నుడననే గర్వంతోనే అగ్నిదేవుడి ఆకలి తీర్చడానికి కార్తవీర్యార్జునుడు సిద్ధపడ్డాడని గ్రహిస్తాడు. బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన అగ్నిదేవుడికి సహకరించి జీవహింసకి పాల్పడిన కారణంగా, బ్రాహ్మణుడి రూపంలోనే మృత్యువు అతన్ని వెతుక్కుంటూ వస్తుందని వశిష్ఠ మహర్షి శపిస్తాడు.
జమదగ్ని మహర్షి ప్రాణాలు తీసిన కార్తవీర్యార్జునుడు, అతని కుమారుడైన పరశురాముడి ఆగ్రహానికి గురవుతాడు. అతని చేతిలోనే అంతం చేయబడతాడు. అలా వశిష్ఠ మహర్షి శాపం కారణంగా, సహస్ర బాహుబల సంపన్నుడైన కార్తవీర్యార్జునుడు కూడా పరశురాముడి పరాక్రమానికి ఎదురు నిలవలేక కుప్పకూలిపోతాడు.