ఆదిపరాశక్తి ఆరాధనా ఫలితం !
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు సమస్త లోకాలను రక్షిస్తూ వుంటుంది. తన బిడ్డల వంటి ప్రజల బాగోగులను వెన్నంటి ఉంటూ పర్యవేక్షిస్తూ వుంటుంది. లోక కల్యాణం కోసం అసుర సంహారం అవసరమైనప్పుడు, త్రిమూర్తులు సైతం అమ్మవారి సాయాన్ని కోరిన సందర్భాలు వున్నాయి. దేవతలంతా ముక్తకంఠంతో ఆ తల్లిని ప్రార్ధించి ఆమె కరుణా కటాక్షాలను పొందిన సందర్భాలు లేకపోలేదు.
ఇక మహర్షులు సైతం తమ ప్రశాంతమైన జీవితానికి భంగం కలిగినప్పుడు, ఆ తల్లి పాదాలను ఆశ్రయించి కావలసిన రక్షణ పొందారు. సాధారణ మానవులు ఆ తల్లి అండదండలతోనే తమ జీవితాన్ని కొనసాగిస్తూ వుంటారు. వివాహం ... సౌభాగ్యం ... సంతానమే అసలైన సంపదలుగా స్త్రీలు భావిస్తూ వుంటారు. వీటన్నింటినీ ప్రసాదించేది ఆదిపరాశక్తియే.
అమ్మవారి అనుగ్రహమే స్త్రీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ వుంటుంది. మహిళలు ఎక్కువగా ఆచరించే నోములు .. వ్రతాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంటాయి. ఈ కారణంగానే మహిళలు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ వుంటారు ... ఆ తల్లి ఆలయాలను దర్శిస్తూ వుంటారు. భక్తి శ్రద్ధలతో చీరసారెలను సమర్పిస్తూ వుంటారు. అమ్మవారి కరుణతో ఎలాంటి లోటూ లేని జీవితాన్ని పొందుతుంటారు.
ఆడపిల్లల జీవితంపై అమ్మవారి ప్రభావం ఎక్కువగా వుంటుంది కనుక, వాళ్లకి బాల్యం నుంచే అమ్మవారి పట్ల గురి కలిగేలా చేయాలి. అనునిత్యం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నమస్కరించడం .. ఆ తల్లి ఆలయాలను దర్శిస్తూ వుండటం ... అమ్మవారి నామాన్ని స్మరిస్తూ వుండటం వంటివి అలవాటు చేయాలి. ఎలాంటి సమయంలోనైనా ఆదుకునే శక్తి ఆదిపరాశక్తియేననే బలమైన విశ్వాసాన్ని కలిగించాలి. దాంతో అమ్మవారి పట్ల వారికి గల భక్తి కూడా పెరుగుతూ వస్తుంది. ఆ తల్లి ఆశీస్సులతో వారి జీవితం సంతోష సౌభాగ్యాలతో కొనసాగుతుంది.