వరాలను ప్రసాదించే వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరస్వామి అర్చామూర్తిని చూసి పరవశించని భక్తులు వుండరు. ఆ స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించి మనసులో ఆ రూపాన్ని నిలుపుకొని వాళ్లూ వుండరు. గర్భాలయంలో నిండుగా ... నిలువెత్తుగా దర్శనమిచ్చే స్వామి రూపాన్ని ఎంతగా చూసినా తనివితీరదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే ఆయన హృదయంలో కొలువై వుంటుంది కనుక, ఆయన ఎక్కడవున్నా వైభవానికి లోటు వుండదు.
ఇక స్వామి ఎడబాటుని భక్తులు ఎంతమాత్రం భరించలేరు గనుక, ఆయన ఎక్కడ కొలువైనా భక్తులు వెతుక్కుంటూ వెళుతూనే వుంటారు. ఆ స్వామి దివ్యరూప దర్శనం తమకి అనునిత్యం లభించాలనే ఉద్దేశంతో తమ గ్రామంలోనే ఆయన ఆలయాన్ని నిర్మించుకుంటారు. అలా భక్తుల సంకల్పం మేరకు నిర్మించబడిన విశిష్టమైన దేవాలయాలో ఒకటి 'పెడసనగల్లు' లో దర్శనమిస్తుంది.
కృష్ణాజిల్లా పరిధిలోగల ఈ క్షేత్రం భక్తులపాలిట కొంగుబంగారమై అలరారుతోంది. శ్రీదేవి - భూదేవి సమేతంగా ఇక్కడ శ్రీవేంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. చాలాకాలం క్రితం నిర్మించబడిన ఈ ఆలయం స్వామివారి మహిమలకు నిలయంగా విలసిల్లుతోంది. ఇక్కడి గ్రామస్తులంతా స్వామివారిని తమ ఇలవేల్పుగా ఆరాధిస్తూ వుంటారు. స్వామివారిని దర్శించుకోవడం వలన ఎలాంటి కష్టమైనా వెంటనే తొలగిపోతుందని చెబుతారు.
ఇక్కడి స్వామివారిని ఆరాధించడం వలన అనారోగ్యపరమైన ... ఆర్ధికపరమైన సమస్యలు దూరమవుతాయని అంటారు. ప్రతి శనివారంతో పాటు విశేషమైన రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. అంకిత భావంతో స్వామివారి పాదాలను ఆశ్రయించినవారికి సుఖశాంతులు చేకూరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు.