మౌనం కూడా ఒక రక్షణ కవచమే !
మౌనంగా వుండటమంటే .. తన కళ్లముందు ఇతరులు మోసపోతూ వుంటే చూస్తూ కూర్చోవడం కాదు. తనకి అన్యాయం జరుగుతూ వుంటే మాట్లాడకుండా ఉండటమూ కాదు. మౌనంగా ఎప్పటివరకూ ఉండాలంటే, తాను మాట్లాడే అవసరం వచ్చేంత వరకు అని అర్థం చేసుకోవాలి.
కొంతమంది ఎప్పుడు చూసినా అదేపనిగా మాట్లాడేస్తూ వుంటారు. పదిమాటలు మాట్లాడితే సహజంగానే అందులో ఏదో ఒక మాట పొరపాటున జారిపోతూ వుంటుంది. అది ఎవరికో ఒకరికి కష్టంగా అనిపిస్తుంది. అప్పటి నుంచి ఆ వ్యక్తితో మనస్పర్థలు మొదలవుతాయి. ఇక ఒక్కోసారి ఒక వ్యక్తిని గురించి ఒక మాట మాట్లాడితే, అది పది మాటలుగా మారిపోయి అవతలి వ్యక్తికి చేరిపోతుంది. ఫలితంగా లేనిపోని గొడవలు మొదలవుతాయి.
అందుకే 'మాట పొదుపు' అని పెద్దలు తమ పిల్లలను హెచ్చరిస్తూ వుంటారు. ఎక్కడపడితే అక్కడ .. ఎలాపడితే అలా మాట్లాడే అలవాటు అనేక చిక్కులను కొనితెస్తుంది. సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది. నవ్వుతూ మాట్లాడినా కొన్ని మాటలు శత్రువుల సంఖ్యను పెంచుతూ వుంటాయి. అందుకే సందర్భాన్నిబట్టి మాట్లాడాలి ... సాధ్యమైనంత తక్కువగా మాట్లాడాలి ... అది కూడా ఆలోచించి మాట్లాడాలని అంటూ వుంటారు. లేదంటే మౌనంగా ఉండటమే అన్ని విధాలా మంచిదని చెబుతుంటారు.
రాముడు ... ధర్మరాజు ... విదురుడు వంటి వారు అవసరమైతేనే తప్ప మాట్లాడేవారు కాదు. ఇక వాళ్లు మాట్లాడవలసి వస్తే అందులో ఒక్కటి కూడా వ్యర్థమైనది వుండేది కాదు. మౌనం వలన ఆలోచనా శక్తి పెరుగుతుందనీ, ఆ తరువాత తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయని మహర్షులే సెలవిచ్చారు. అందుకే అవసరాన్నిబట్టి మాట్లాడాలి ... అవసరమైనంతవరకే మాట్లాడాలి .. లేదంటే మౌనంగా వుండాలి. మౌనాన్ని ఆశ్రయించినవారిని అది ఎప్పుడూ కాపాడుతూనే వుంటుంది. కలహాలకు ... వివాదాలకు వీలైనంత దూరంలో వుంచుతూనే వుంటుంది.