ఈ రోజున పాదరక్షలను దానంగా ఇవ్వాలి
పూజలు ... నోములు ... వ్రతాలు మొదలైనవి నిర్వహించిన తరువాత, ఆయా సందర్భాలను బట్టి కొన్నిరకాల దానాలు చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయా సమయాల్లో చేసే ఈ దానాలను పరిశీలిస్తే, అవి రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవిగా అర్థమవుతుంది. ఆ దానాలను స్వీకరించేవారికి అవి ఎంతగానో ఉపయోగపడాలనే ప్రధాన ఉద్దేశం స్పష్టమవుతుంది.
చలికాలం రావడానికిముందు దుప్పట్లు ... వస్త్రాలు, వర్షాకాలం రావడానికి ముందు గొడుగు ... అలాగే వేసవికాలం రావడానికి ముందు పాదరక్షలు దానంగా ఇవ్వడమనేది ఆయా వ్రతాలలో భాగంగా కనిపిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలోనే 'విజయ ఏకాదశి' రోజున 'పాదరక్షలు' దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది.
ఫాల్గుణ బహుళ ఏకాదశి రోజునే శ్రీరామచంద్రుడు వారధి నిర్మాణాన్ని ఆరంభించి ఆ తరువాత రావణుడిని సంహరించి విజయాన్ని సాధించాడని అంటారు. అందువలన ఇది 'విజయఏకాదశి' గా పిలవబడుతోంది. ఈ రోజున ఉపవాసంతో కూడిన జాగరణకు సిద్ధపడి, శ్రీమన్నారాయణుడిని అత్యత భక్తిశ్రద్ధలతో పూజించవలసి వుంటుంది. విజయ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడిని సేవించడంవలన, తలపెట్టినకార్యాల్లో విజయం చేకూరుతుంది.
అలాగే ఈ రోజున పాదరక్షలను దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. ఈ మాసం నుంచే ఎండలు మరింత ముదురుతుంటాయి. అందువలన దానంగా స్వీకరించినవారికి పాదరక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. దానంగా ఇచ్చినది తీసుకున్నవారికి పూర్తిస్థాయిలో ఉపయోగపడినప్పుడే దానంగా ఇచ్చినవారికి పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. అందువలన విజయ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ... పాదరక్షలను దానంగా ఇవ్వడం మరచిపోకూడదు.