అమ్మవారి దర్శనంతోనే అన్ని శుభాలు !

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి చెందినటు వంటి క్షేత్రాల్లో 'వీరమ్మ తల్లి' క్షేత్రం ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి 'ఉయ్యూరు' గ్రామంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఎక్కువ రోజులు జాతర జరుపుకునే మహిమాన్వితమైన క్షేత్రంగా కూడా దీనికి పేరుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరలో ఏ రోజుకారోజు భక్తుల సందడి పెరుగుతుందే గానీ తగ్గడం మాత్రం ఇక్కడ కనిపించదు.

అమ్మవారు అత్తంటివారి నుంచి పుట్టింటికి రావడం ... తిరిగి పుట్టింటి నుంచి అత్తవారిల్లుగా చెప్పబడుతోన్న ఆలయానికి వెళ్లడం ఈ జాతర సమయంలో జరుగుతుంది. వేలాదిగా భక్తులు పాల్గొనే ఈ తంతు చాలా సందడిగా ... సంబరంగా జరుగుతుంది. ఈ జాతరలో భాగంగానే 'సిరిబండి' ఉత్సవం జరుగుతుంది. అమ్మవారు తన వాహనం తయారీకి అవసరమైన వృక్షాన్ని తానే ఎంపిక చేస్తుందట.

ఇక్కడికి దగ్గరలో గల ఒక తోటకి వెళ్లి అక్కడి వృక్షానికి అమ్మవారు రాత్రి సమయంలో బొట్టుపెడుతుందట. మరునాడు ఆ చెట్టును వెతికి పట్టుకుని దానితోనే అమ్మవారి ఊరేగింపుకు అవసరమైన వాహనాన్ని తయారుచేస్తూ వుంటారు. ఇలా అమ్మవారు సరైన చెట్టుని ఎంపిక చేసే సమయంలో ఒక్కోసారి భక్తులకంటపడిన సందర్భాలు కూడా వున్నాయని చెబుతుంటారు. ఈ ఉత్సవ సమయంలో అమ్మవారిని దర్శించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని అంటారు. అనారోగ్యాలు ... దారిద్ర్యం తొలగిపోవడమే కాకుండా, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News