అదంతా లోకకల్యాణం కోసమే !
అనుక్షణం నారాయణుడి నామస్మరణ చేస్తూ త్రిలోకాలలోనూ నారద మహర్షి సంచరిస్తూ వుంటాడు. ఆయనని అందరూ సాదరంగా ఆహ్వానించేవారే ... గౌరవ మర్యాదలతో వ్యవహరించేవారే. ఇక ఆయన వచ్చాడు అంటే అందుకు ఏదో కారణం వుండే ఉంటుందని భావించేవారు. నారద మహర్షి వలన లేనిపోని గొడవలు మొదలవుతాయని భావించినవాళ్లు, ఆయన చేసిన పని లోకకల్యాణ కారకమని ఆ తరువాత తెలుసుకున్నారు.
హిరణ్యకశిపుడి ఇంట శ్రీహరి నామస్మరణతో ప్రహ్లాదుడు పెరిగేలా చేసింది నారదుడే. అలాగే పరమశివుడి ఆత్మలింగాన్ని రావణుడు లంకా నగరానికి తీసుకువెళ్లకుండా చేసిందీ నారదుడే. బాణాసురుడి కుమార్తె ఉష ... కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడితో ప్రేమలో పడి, కృష్ణుడితో బాణాసురుడు యుద్ధానికి దిగేలా చేయడంలో ప్రధానమైన పాత్రను పోషించినవాడు నారదుడే.
ఇక సాధుసజ్జనులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోన్న 'జలంధరుడు' శివుడిచే సంహరించబడేలా చేసిందీ నారదుడే. జలంధరుడి ఆగడాలకి అడ్డుకట్ట వేయడం కోసం, అతను కోరిన చోటున నివసించడానికి నారాయణుడు అంగీకరిస్తాడు. లక్ష్మీనారాయణులు వైకుంఠాన్ని విడిచి వెళ్లడమనే విషయాన్ని సదాశివుడితో సహా ఎవరూ జీర్ణించుకోలేక పోతారు. ఆ సందర్భంలోనే సదాశివుడి సూచన మేరకు నారద మహర్షి ఒక ఆలోచన చేస్తాడు.
ఫలితంగా జలంధరుడి మనసు పార్వతీదేవి వైపు మళ్లుతుంది. పార్వతీదేవి విషయంలో శివుడికి ఆగ్రహాన్ని కలిగించిన జలంధరుడు, ఆయన చేతిలో సంహారించబడతాడు. దాంతో దేవతలు .. మహర్షులు ... మానవాళి తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. ఇలా లోక కల్యాణం కోసం నారద మహర్షి అనేకమార్లు తన వంతు కృషిచేసినవాడిగా కనిపిస్తాడు. మంచిని కోరుకునే మహానుభావులందరికీ దగ్గరవాడిలా అనిపిస్తాడు.