కీర్తి ప్రతిష్ఠలను ప్రసాదించే నరసింహుడు

భక్తుడితో భగవంతుడు ఎంతటి అనుబంధాన్ని కలిగి ఉంటాడో, తన భక్తుడిని కాపాడుకోవడం కోసం భగవంతుడు ఎంతగా ఆరాటపడతాడోననేది ప్రహ్లాదుడి విషయంలో స్పష్టమవుతూ వుంటుంది. తన భక్తులను బాధించేవారి పట్ల భగవంతుడు ఎంతటి ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడనేది ఈ సంఘటన నిరూపిస్తూ వుంటుంది. అలాగే సాక్షాత్తు భగవంతుడి ఆగ్రహావేశాలను సైతం భక్తుడి ప్రార్ధన శాంతింపజేయగలదనేది ఈ సంఘటన నిరూపిస్తూ వుంటుంది.

అలా భక్తుడి కోసం అవతరించిన నరసింహస్వామి ఆ భక్తుడిని రక్షించిన తరువాత అనేక ప్రాంతాల్లో లక్ష్మీ సమేతుడై ఆవిర్భవించాడు. అలా స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాల్లో ఒకటిగా 'శింగరాయపాలెం' కనిపిస్తుంది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. నరసింహస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ప్రాచీన వైభవాన్నీ ... చారిత్రక విశేషాలను ఆవిష్కరిస్తూ వుంటుంది.

స్వామివారు కొలువై వుండటం వెనుక ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక్కడి లక్ష్మీనరసింహుడు కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటాడు. వ్యాధులు ... బాధలు ఏవైనా సరే ఆయనతో చెప్పుకోనంత వరకే వుంటాయని అంటారు.

అయితే ఎవరు ఏది కోరాలనుకున్నా ఆ స్వామి పట్ల అపారమైన విశ్వాసంతో వుండాలని చెబుతారు. ఎలాంటి పరిస్థితుల్లోను స్వామి మహిమల పట్ల సందేహానికి లోనుకావొద్దని అంటారు. అంకితభావంతో స్వామిని పూజిస్తే అడిగిన వరం వెంటే వస్తుందని చెబుతుంటారు. దుష్టశక్తులు పెట్టే బాధలతో .. గ్రహసంబంధమైన ఇబ్బందులతో సతమతమైపోయేవారు, ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన్నే వాటి నుంచి విముక్తి లభిస్తుందని అంటారు. స్వామి అనుగ్రహంతో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని చెబుతారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. అందరూ ఆ స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తూ వుంటారు ... పునీతులవుతుంటారు.


More Bhakti News