పరమాత్ముడి పాదస్పర్శ అలాంటిది !
గౌతమ మహర్షి శాపం కారణంగా 'అహల్య' బండరాయిగా మారిపోతుంది. శ్రీరాముడి పాదస్పర్శ వలన ఆ శాపం నుంచి విముక్తిని పొందుతుంది. అలాగే వృత్రాసురుడి శాపం వలన దేవేంద్రుడు కూడా బండరాయిగా మారిపోతాడు. శ్రీకృష్ణుడి పాదస్పర్శ వలన తిరిగి పూర్వరూపాన్ని పొందుతాడు. ఆసక్తికరమైన ఈ సంఘటనకు వేదికగా 'పండరీపురం' దర్శనమిస్తుంది.
ఇంద్ర పదవిపై అసురులు ఆశపడటం ... అమరలోకంపై దండెత్తడం చాలామార్లు జరిగింది. అలాంటి వారందరితో దేవేంద్రుడు తరచూ పోరాడవలసి వస్తుండేది. అలాగే తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం దేవేంద్రుడు ఒకసారి వృత్రాసురుడితో తలపడతాడు. పథకం ప్రకారం వృత్రాసురుడిని దేవేంద్రుడు దెబ్బత్తీస్తాడు. బండరాయివై పడివుండమని ఇంద్రుడిని శపిస్తూ వృత్రాసురుడు కుప్పకూలిపోతాడు.దాంతో దేవేంద్రుడు బండరాయిగా మారిపోతాడు.
కాలక్రమంలో పుండరీకుడు అనే భక్తుడిని అనుగ్రహించడం కోసం పాండురంగడుగా కృష్ణుడు ఆ ప్రదేశానికి వస్తాడు. ఆ సమయంలో పుండరీకుడు తన తల్లిదండ్రులను సేవిస్తుంటాడు. తల్లిదండ్రుల సేవకి భంగం కలిగించకుండా, కొంతసేపు ఆ బండరాయిపై నిరీక్షించమని అంటాడు పుండరీకుడు. దాంతో కృష్ణుడు ఆ బండరాయిపై నుంచోగానే ఆయన పాద స్పర్శ కారణంగా దేవేంద్రుడు నిజరూపాన్ని పొందుతాడు.
తనకి శాపవిమోచనాన్ని కలిగించినదుకు కృష్ణభగవానుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఆ తరువాత పుండరీకుడి అభ్యర్థనమేరకు స్వామి అక్కడే ఆవిర్భవిస్తాడు. అలా పుండరీకుడు మాత్రమే కాకుండా దేవేంద్రుడు కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందిన పరమపవిత్రమైన క్షేత్రంగా పండరీపురం దర్శనమిస్తూ వుంటుంది ... ధన్యులను చేస్తూ వుంటుంది.