అలా లక్ష్మీదేవి అనుగ్రహం లభించిందట !
సంగీతం ... సాహిత్యం ... భక్తిశ్రద్ధలు పూర్వజన్మ సుకృతం వలన మాత్రమే కలుగుతాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కవిపండితులను ... సంగీత విద్వాంసులను ... భక్తాగ్రేసరులను పరిశీలిస్తే, బాల్యం నుంచే వాళ్లు వాటి పట్ల శ్రద్ధాసక్తులు చూపినట్టు స్పష్టమవుతూ వుంటుంది. భగవంతుడి మనసు గెలుచుకోవడానికి వీళ్లు సంగీత సాహిత్యాలను సాధనంగా చేసుకుని తరించారు.
అలా తన సుస్వరంతో దైవాన్ని కీర్తిస్తూ ఆ అనుభూతిలో తరించిన మహానుభావుడిగా 'ముత్తుస్వామి దీక్షితులు' కనిపిస్తాడు. దైవాన్ని నిస్వార్థ భక్తితో ఆరాధించినప్పుడే అనిర్వచనీయమైన అనుభూతిని పొందడం సాధ్యమవుతుంది. అలాంటి అనుభూతిని సొంతం చేసుకునేవారు దైవం నుంచి మరేదీ ఆశించరు. ఆ దైవాన్నే తప్ప మానవమాత్రులను ఆశ్రయించరు.
అలాంటి దీక్షితులవారు ఒక క్షేత్రానికి వెళ్లినప్పుడు లక్ష్మీదేవిని కీర్తిస్తూ స్వరార్చన చేశారు. ఆయన గానమాధుర్యానికీ ... భక్తిశ్రద్ధలకు మురిసిపోయిన అమ్మవారు ఆ రాత్రి ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చి అనుగ్రహించిందట. దైవాన్ని మెప్పించడానికీ ... సాక్షాత్కారాన్ని పొందడానికి సంగీతానికి మించిన సాధనం లేదని మరోమారు ఆయన నిరూపించాడు. ఇలా సంగీత ప్రపంచాన్నీ ... ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రభావితం చేస్తూ, దైవం యొక్క ప్రీతిని పొందిన మహానుభావులలో ముత్తుస్వామి దీక్షితులు ముందువరుసలో కనిపిస్తుంటాడు.