ఆదిదేవుడి క్షేత్రంలో అడుగుపెడితే చాలు
శ్రీమన్నారాయణుడి స్వరూపమైన శ్రీరామచంద్రుడు, సీతాన్వేషణ సమయంలో రావణుడిని ఎదుర్కునే శక్తిని తనకి ప్రసాదించమని కోరుతూ ఆయా ప్రదేశాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తూ ... పూజిస్తూ వెళ్లాడు. అలాగే రావణుడి సంహారం అనంతరం ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాడు.
అలాగే పరశురాముడు కూడా క్షత్రియ సంహారం వలన కలిగిన పాపం నుంచి విముక్తిని పొందడం కోసం ఎన్నో ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి ఆరాధించాడు. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'రామతీర్థం' కనిపిస్తుంది. కర్నూలు జిల్లా పరిధిలోగల ఈ క్షేత్రంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడి పుణ్యతీర్థంలో స్నానమాచరించి స్వామిని పూజించాడు.
అందువలన ఇక్కడి స్వామివారు 'పరశురామేశ్వరుడు' పేరుతో ఆరాధించబడుతుంటాడు. ఈ తీర్థం 'రామతీర్థం' పేరుతో పిలవబడుతోంది. ప్రాచీనకాలంనాటి ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన ... రామతీర్థంలో స్నానమాచరించడం వలన పాపాలు పటాపంచలైపోతాయని చెప్పబడుతోంది. ఎలాంటి దోషాల బారినుంచైనా బయటపడతారని స్పష్టం చేయబడుతోంది. ఇదే క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంతో పాటు, నరసింహస్వామి ఆలయం కూడా దర్శనమిస్తుంది.
సుబ్రహ్మణ్యస్వామితో పాటు నరసింహస్వామి కూడా స్వయంభువు కావడం ఇక్కడి విశేషం. ఈ కారణంగా ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా విలసిల్లుతోంది. ఎంతోమంది మహర్షులు ... మహారాజులు ఈ క్షేత్ర దర్శనంతో తరించారు. విశేషమైన పర్వదినాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తజన సందోహంతో ఆలయం సందడిగా కనిపిస్తూ వుంటుంది. ప్రాచీన వైభవాన్నీ ... చారిత్రక నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఈ క్షేత్రదర్శనం మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.