ఇతరులను నిందిస్తే తగ్గిపోయే పుణ్యరాశి
కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఇద్దరు బంధువులుగానీ .. స్నేహితులు గాని కలుసుకుంటే అక్కడలేని మూడవ వ్యక్తిని గురించిన ప్రస్తావనని ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకువస్తుంటారు. ఆ వ్యక్తి అలాంటివాడనీ ... ఇలాంటివాడని అంటారు. ఆ వ్యక్తి బలహీనతలను గురించి పూసగుచ్చినట్టుగా చెబుతారు. అతని ధోరణి వలన చుట్టూవున్న వాళ్లంతా చెడిపోతున్నారని అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఆ వ్యక్తికి దూరంగా ఉండటం మంచిదనీ, అతనికి ఎలాంటి సహాయ సహకారాలను అందించకూడదని అంటారు.
ఇక ఎదుటి వ్యక్తి ఎవరి గురించి అయితే చెబుతూ ఉన్నాడో, ఆ వ్యక్తి మంచివాడనే విషయం రెండవ వ్యక్తికి తెలిసినా ఆ సమయంలో అతను మౌనంగానే ఉంటాడు. ఆ వ్యక్తి తనకి బాగా తెలుసనీ .. అతను చాలా మంచివాడంటూ ఎదుటి వ్యక్తి మాటలను ఖండించడు. అలా చేస్తే తనతో మాట్లాడుతోన్న వ్యక్తి నొచ్చుకుంటాడనో, లేదంటే తనకి కూడా అతను శత్రువుగా మారి తన గురించి కూడా చెడుగా ప్రచారం చేస్తాడనో ఆలోచిస్తాడు. ఎందుకొచ్చిన గొడవలే అనుకుని అతను చెప్పినదంతా తీరికగా వింటాడు.
ఇక అతను వింటున్నాడు కదా అని ఎదుటి వ్యక్తి తనకి ఇష్టం లేని మూడవ వ్యక్తిని గురించి తన అక్కసునంతా వెళ్లబోసుకుని వెళ్లిపోతాడు. మరొకరితో మరొకచోట ఇదే వ్యవహారాన్ని మొదలుపెడతాడు. ఇలాంటి మాటల వలన మనసు మలినమవుతుంది ... సమయం వృథా అవుతుంది. అంతే కాదు పరనింద చేయడం వలన మొదటి వ్యక్తి ఎంత పాపాన్ని మూటగట్టుకుంటాడో, ఆ మాటలను తీరికగా విన్నవాళ్లు కూడా అంతే పాపాన్ని పొందుతారు.
అందుకే ఇతరులను నిందించడం మానుకోవాలి. అలా నిందించేవారి మాటలను వినడానికి ఆసక్తిని చూపించకుండా దూరంగా వుండాలి. లేదంటే పాపం పెరిగిపోవడమే కాకుండా, అప్పటివరకూ పెంచుకున్న పుణ్యరాశి ఏదైనా వుంటే అది కాస్తా వెంటనే తరిగిపోతుంది.ఇలాంటి వాళ్లు ఎవరి గురించైతే మాట్లాడుకుంటూ వుంటారో ఆ వ్యక్తి అక్కడ లేదు కదా అని మాత్రమే అనుకుంటారు. పైన భగవంతుడనేవాడు ఒకడు వున్నాడనే విషయాన్ని మాత్రం మరిచిపోతుంటారు.