దారిద్ర్యాన్ని నివారించే అభిషేకం

పండితులు ఆశువుగా స్తుతిస్తుంటే పొంగిపోయే శివుడు, అక్షరజ్ఞానం లేని భక్తులు తమకి తోచిన విధంగా ఆరాధిస్తున్నా అదే విధంగా ఆనందిస్తాడు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. అంకితభావం వున్నవాళ్లందరూ ప్రీతిపాత్రులే. అలాంటి శివుడు అభిషేకం ద్వారా చల్లబడతాడు. సంతోషంతో సంతృప్తి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటాడు. అందుకే భక్తులు ఆ స్వామికి అభిషేకాలు జరిపిస్తుంటారు.

మరికొందరు తమ పూజామందిరంలోనే చిన్నపాటి శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజాభిషేకాలు జరుపుతుంటారు. వివిధ పదార్థాలతోను ... లోహాలతోను చేయబడిన శివలింగాలను పూజించడం వలన, అనేకరకాల ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే ఆ దేవదేవుడికి జరిపే అభిషేక ద్రవ్యాలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే 'సువర్ణ జలం' తో చేయబడే అభిషేకం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. కొద్దిగా సువర్ణం వేయబడినటువంటి జలంతో పరమశివుడిని అభిషేకించడం వలన దారిద్ర్యం నివారించబడుతుందని చెప్పబడుతోంది. దారిద్ర్యాన్ని దహించేవాడిగానే పరమశివుడు చెప్పబడుతున్నాడు. అలాంటి ఆ సదాశివుడిని సువర్ణ జలంతో అభిషేకించడం వలన ఆ స్వామి మనసు గెలుచుకోబడుతుంది. ఫలితంగా దారిద్ర్యం తరిమివేయబడుతుంది.

దారిద్ర్యం చుట్టుముడుతోందనే విషయం కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తూనే వుంటుంది. ఆదాయ మార్గాలు మూసుకుపోతూ వుండటం .. అనుకోని నష్టాలు ఎదురవుతూ వుండటం .. సహాయ సహకారాలను అందించే వాళ్లు ఊహించని విధంగా దూరమవుతూ వుండటం జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటోన్న వాళ్లు సువర్ణ జలంతో పరమేశ్వరుడిని అభిషేకించడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News