భగవంతుడికి ప్రీతిని కలిగించేది ఏది ?

వశిష్ఠమహర్షి - అరుంధతి ... అత్రిమహర్షి - అనసూయాదేవి ... చ్యవనమహర్షి - సుకన్య తదితరులు భగవంతుడి సేవకే తమ జీవితాన్ని అంకితం చేశారు. ఇక వారి భార్యలు భగవంతుడి ఆరాధనలో భర్తలకు సహకరిస్తూ వారి సేవలో తరించారు. మహర్షులంతా తమ తపోశక్తితో లోకకల్యాణానికి కారకులయ్యారు. ఇక వారి భార్యలు మహాపతివ్రతలుగా లోకానికి ఆదర్శప్రాయమై నిలిచారు. ఇందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తుంటాయి.

మహర్షులు మాత్రమే కాదు కొంతమంది మహాభక్తులు ... వారి భార్యలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించారు. అలాంటి భక్తులలో జయదేవుడు ... పతివ్రతలలో ఆయన భార్య పద్మావతి ఒకరుగా కనిపిస్తారు. జయదేవుడికి రాధాకృష్ణులే లోకం. కనులముందు వాళ్ల ఆటపాటలను ఆవిష్కరించుకుని, ఆ అనుభూతిలో తేలిపోతూ ఉండేవాడు. ఆయన భార్యకు జయదేవుడే సర్వస్వం ... ఆయన రచనలకు తగిన సహకారాన్ని అందిస్తూ ఆమె ఆనందాన్ని పొందుతూ వుండేది.

అలాంటి పద్మావతి పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం జయదేవుడు మరణించినట్టు ఒక రాణి తన చెలికత్తెతో అబద్ధం చెప్పిస్తుంది. పతివ్రత అయిన పద్మావతి ఆ వార్త విన్న మరుక్షణమే తన ప్రాణాలను వదిలేస్తుంది. ఈ విషయం తెలిసి జయదేవుడు ఎంతగానో బాధపడతాడు. రాధాకృష్ణుల సన్నిధిలో తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు.

కృష్ణభగవానుడు ఆయనని అనుగ్రహించడం వలన గాఢనిద్ర నుంచి మేల్కొన్నట్టుగా పద్మావతి కనులు తెరుస్తుంది. ఎదురుగా సజీవంగా వున్న భర్తను చూసి ఆమె ... తన భార్యకు పునర్జీవితాన్ని ప్రసాదించినందుకు జయదేవుడు సంతోషంతో పొంగిపోతారు. భర్త మరణవార్త విన్న మరుక్షణమే ప్రాణాలు విడవడం పద్మావతి పాతివ్రత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అలాంటి భార్యను బతికించుకోవడం జయదేవుడి భక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది.


More Bhakti News