వ్యాధులను నివారించే సూర్యభగవానుడు
సమస్త లోకాలకు వెలుగునుపంచేవాడు సూర్యభగవానుడు. ఆయన రాకతోనే సమస్త జీవుల దినచర్య ఆరంభమవుతుంది. దుష్టశక్తులకు రహస్యంగా ఆశ్రయమిచ్చే చీకటి ఆయన రాకతోనే కంటికి కనిపించకుండా పారిపోతుంది. మానవాళికి బాధలను కలిగించే వివిధరకాల వ్యాధికారక క్రిములు సూర్యభగవానుడి రాకతోనే నశిస్తాయి.
ఇలా జీవరాశికి మేలు చేయడం కోసం అనుదినం ఒక నియమం ప్రకారం వచ్చి వెళ్లేవాడుగా సూర్యభగవానుడు కనిపిస్తుంటాడు. ప్రత్యక్ష నారాయణుడుగా మానవాళిచే పూజించబడుతుంటాడు. అలాంటి సూర్యభగవానుడు కొన్ని ప్రాచీన క్షేత్రాల్లో అర్చామూర్తిగా దర్శనమిస్తూ వుంటాడు. దేవతలు ... మహర్షులు ... మహాభక్తులు మొదలైనవారు సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందిన ఆసక్తికరమైన కథనాలు ఆయా క్షేత్రాల్లో వినిపిస్తూ వుంటాయి.
దేవతలలో కొందరు తమ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించడం వలన శాపాలకు గురై చర్మసంబంధమైన వ్యాధులతో అవస్థలు పడ్డారు. అలాగే భోగభాగ్యాలు వున్నా అనుభవించడానికి అవకాశం లేని చర్మవ్యాధులతో ఇబ్బందులు పడిన రాజులు వున్నారు. ఇక ఏ జన్మలో చేసిన పాపం కారణంగానో చర్మవ్యాధులతో సతమతమైపోతూ సూర్యభగవానుడి క్షేత్రాలను ఆశ్రయించిన వాళ్లు ఎంతోమంది వున్నారు.
వాళ్లంతా కూడా సూర్యభగవానుడిని అసమానమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకున్నారు. సుదీర్ఘ కాలంగా తమని పీడిస్తూ వున్న చర్మవ్యాధుల నుంచి విముక్తిని పొందారు. అందుకే ప్రాచీన కాలానికి చెందిన క్షేత్రాల్లో సూర్యభగవానుడు ప్రధాన దైవంగా వున్నా, అదే ప్రాంగణంలో ప్రత్యేక ఆలయంలో కొలువైవున్నా ఆ స్వామిని సేవించడం మరచిపోకూడదు. సూర్యభగవానుడి ఆలయం ఎక్కడ వున్నా అది మహిమాన్వితమైనదే. అనునిత్యం సూర్యభగవానుడికి నమస్కరిస్తూ వుండాలి ... ఆ స్వామి కొలువైన క్షేత్రాలను దర్శించి ఆయన పాదాలను సేవిస్తూ వుండాలి.