ఇక్కడి స్వామివారి దర్శనభాగ్యం చాలు
శ్రీమహావిష్ణువు అలంకారప్రియుడే కాదు ... ప్రకృతి ప్రియుడు కూడా. అందుకే అమ్మవారితో కలిసి ఆయన భూలోకంలోని అనేక సుందరమైన ప్రదేశాల్లో విహరించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే ఆయన కొండలు .. వనాలు ... జలపాతాలు ... వాటిపై ఆధారపడి జీవించే జీవరాశులను చూస్తూ మురిసిపోయాడు. తన సృష్టిలోని సౌందర్యానికి తానే పరవశించిపోయాడు.
అలాంటి అనుభూతిని కలిగించే పవిత్ర ప్రదేశాల్లో అమ్మవారితో కలిసి ఆవిర్భవించాడు. ఇక ఆయన ఎక్కడ వుంటే అక్కడ చుట్టూ భక్త జనం ఉండవలసిందే. అక్కడి వైభవాన్ని చూసి వాళ్లు తరించిపోవలసిందే. అందుకే ఆయన ఆవిర్భవించిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా అలరారుతూ, భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి. అనేక విశేషాలకు ... మహిమలకు నిలయాలుగా వెలుగొందుతూ వుంటాయి.
అలాంటి దివ్యక్షేత్రాలలో ఒకటిగా 'తిరునీర్ మలై' కనిపిస్తుంది. తమిళనాడు - చెన్నై సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కొండపైగల ఈ క్షేత్రం చుట్టూ తీర్థజలాలు వుండటం వలన ఈ పేరు వచ్చిందని అంటారు. ఇక్కడి స్వామివారు 'నీర్ వణ్నర్' పేరుతోను ... అమ్మవారు 'అణిమామలార్ మంగైతాయారు' పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. విష్ణుభక్తులైనటు వంటి పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరుగా చెప్పబడుతోన్న 'పూదత్తాళ్వార్' ఇక్కడి స్వామిని కీర్తించి తరించాడని స్థలపురాణం చెబుతోంది.
ఇక్కడి 'మణికర్ణిక' పుష్కరిణి దర్శనమాత్రం చేతనే పాపాలను ప్రక్షాళన చేసి పుణ్యఫలాలను అందిస్తుందని చెప్పబడుతోంది. నూటా ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో, స్వామివారి సౌందర్యం చూసి తీరవలసిందే. అమ్మవారి చల్లనిచూపు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తూ వుంటుంది. విశేషమైన రోజుల్లో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు ... సేవలు స్వామివారి వైభవానికి అద్దంపడుతూ వుంటాయి. మనోహరమైన ఈ దివ్యక్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన్నే సమస్తదోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.