మనసుదోచే మహిమాన్విత క్షేత్రం
ఆదిదేవుడు ఆవిర్భవించిన ప్రతి క్షేత్రం వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం వినిపిస్తుంది. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో 'త్రిపురాంతకం' ఒకటిగా కనిపిస్తుంది. లోకకల్యాణం కోసం తారకాసురుడి సంహారం జరగవలసి వుంది. అది శివపుత్రుడి చేతిలో జరగవలసి వుంది. దాంతో శివపార్వతుల వివాహం జరగడం ... కుమారస్వామికి జన్మనివ్వడం జరిగిపోతాయి. కుమారస్వామి చేతిలో తారకాసురుడు అంతం చేయబడతాడు.
అలా ఈ కార్యక్రమంలో శివపార్వతులు ... కుమారస్వామి ప్రధానమైన పాత్రను పోషిస్తారు. అయితే అసలుగొడవ ఆ తరువాతనే ఆరంభమవుతుంది. తారకాసురుడి ముగ్గురు కుమారులు తండ్రి మరణానంతరం ఆగ్రహోదగ్రులవుతారు. ఆకాశమార్గాన సంచరించే మూడు పురాలను (నగరాలను) వరంగా పొంది, తమకి మరణమనేది లేకుండా ఉండేలా చూడమని బ్రహ్మదేవుడిని కోరతారు.
ఆ మూడుపురాలు ఒకదాని సమీపంగా ఒకటి రానంతవరకూ వాళ్లకి మరణమనేది ఉండదని బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ తరువాత నుంచి వాళ్లు సాగిస్తోన్న ఆగడాలకు హద్దులేకుండా పోతుంది. దాంతో గగన మార్గంలో సంచరించే ఆ మూడు పురాలు ఒక దగ్గరికి వచ్చేలా చేసి ఒకే ఒక్క బాణంతో శివుడు త్రిపురాసురులను సంహరిస్తాడు.
ఆ తరువాత ఆయన ఆవిర్భవించిన ప్రదేశమే ఇది. అందుకే దీనిని త్రిపురాంతకం అనీ ... ఇక్కడి శివుడిని త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తుంటారు. లోకకల్యాన కార్యక్రమం తరువాత ఆదిదేవుడు బాలాత్రిపురసుందరి సమేతంగా ఆవిర్భవించిన క్షేత్రం కావడం వలన ఇది మహిమాన్వితమైన క్షేత్రమని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. అందుకు నిదర్శనంగానే ఈ క్షేత్రం అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరిస్తూ వుంటుంది. కోరినవరాలను ఆలస్యం చేయక అందిస్తూనే వుంటుంది.