రుద్రుడిని శాంతింపజేసే ఏకాదశ రుద్రాభిషేకం
విశ్వనాథుడు ఆర్తజన రక్షకుడు .. దీనజన పోషకుడు .. లోకకల్యాణ కారకుడు. కైలాసవాసిగా చెప్పబడుతూవున్నా, కూతవేటు దూరంలోనే ఉన్నట్టుగా పిలవగానే పరిగెత్తుకు వస్తూనే ఉంటాడు .. తన భక్తులను ఉద్ధరిస్తూనే వుంటాడు. అలాంటి స్వామికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం ... ఇక ఏకాదశ రుద్రాభిషేకం అంటే మరింత ఇష్టం.
పరమశివుడు కాలకూట విషాన్ని నేరేడుపండు పరిమాణంలోకి మార్చి దానిని మింగివేస్తాడు. లోకాలను రక్షించడం కోసం ఆ విషాన్ని కంఠంలోనే అదిమి వుంచుతాడు. ఆ విషప్రభావం కారణంగా ఆయన తీవ్రమైన వేడిని భరిస్తూ వుంటాడు. ఆ వేడి నుంచి ఉపశమనం లభిస్తూ వుంటుంది కనుకనే, ఆయనకి అభిషేకం ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది.
అలాగే రుద్రుడుగా చెప్పబడుతోన్న ఆ స్వామిని ప్రసన్నుడిని చేసేదిగా 'ఏకాదశ రుద్రాభిషేకం' కనిపిస్తుంది. పరమశివుడిని పరవశుడిని చేసేవిగా నమకం - చమకం చెప్పబడుతున్నాయి. నమక చమకాలతో చేసే ఏకాదశ రుద్రాభిషేకం వలన రుద్రుడు చల్లబడతాడు. శాంతాన్ని పొందిన పరమశివుడు భక్తులపై తన కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తాడు.
ఎవరు దేనిని ఆశించి ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరుపుతారో, ఆ మనోభీష్టం నెరవేరేలా చేస్తాడు. ఏకాదశ రుద్రాభిషేక ఫలితం వలన కష్టాలు .. నష్టాలు .. ఆపదలు తొలగిపోతాయి. ఆరోగ్యం .. ఆయుష్షు .. ఐశ్వర్యం .. లభిస్తాయి. అందువల్లనే విశేషమైన రోజుల్లో విశ్వనాథుడికి ఏకాదశ రుద్రాభిషేకం జరిపించాలి. ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలి.