దేనినైనా ప్రసాదించగలిగినది ఇదే !
తనని పూజించడంకన్నా గురువును సేవించడం వలన భగవంతుడు ఎక్కువగా ప్రీతిచెందుతాడు. అందుకే తన గురించి ఎలాంటి ప్రార్ధన చేయకపోయినా, గురువు పట్ల అసమానమైన విశ్వాసం కలిగిన శిష్యులకి ఆయన తనంతట తానుగా దర్శనమిచ్చిన సందర్భాలు వున్నాయి. ఇక కొంతమంది భక్తులు దైవారాధనకి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తే, వాళ్ల సమస్యలు గురువు అనుగ్రహం వలన మాత్రమే పరిష్కారం కాగలవనీ, అందువలన ఫలానా గురువును ఆశ్రయించమని దైవమే సెలవిచ్చిన సంఘటనలు వున్నాయి.
ఇలాంటివి గురువు యొక్క గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. అలాంటి గురువులుగా ఆదిశంకరాచార్యులు .. రాఘవేంద్రస్వామి .. వీరబ్రహ్మేంద్రస్వామి .. శిరిడీ సాయిబాబా .. అక్కల్ కోట స్వామి తదితరులు కనిపిస్తుంటారు. మంచినీ .. మానవత్వాన్ని పెంచడానికి వీళ్లు తమవంతు కృషిచేస్తూ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. గురువు స్పర్శించడం వలన ... ఆయన చల్లనిచూపు సోకడం వలన సుదీర్ఘమైన వ్యాధుల నుంచీ, అంగవైకల్యం నుంచి బయటపడినవాళ్లు ఎంతోమంది వున్నారు.
చేతులు పనిచేయని వాళ్లు .. గురువు పాదాలను తమ చేతులతో స్పర్శించాలని అనుకోగానే వాళ్ల చేతులు పనిచేశాయి. కాళ్లలో సత్తువలేకపోయినా, ఎంతోదూరం నుంచి గురువును దర్శించడానికి వచ్చినవారికి కాళ్లలో బలం చేకూరింది. ఒక్కసారైనా తమ గురువును చూడాలని ఆరాటపడిన చూపులేనివారికి చూపు లభించింది. ఒక్కసారిగా గొంతెత్తి గురువును స్తుతించాలనుకున్న మూగవారికి మాట వచ్చింది.
ఇక ఎలాంటి ఔషధాలకు లొంగని సుదీర్ఘమైన వ్యాధులు గురువు స్పర్శమాత్రం చేతనే మటుమాయమైపోయాయి. ఇవన్నీ గురువు సమక్షంలో .. ఆయన సన్నిధిలో .. ఆయన కృపాదృష్టి వలన జరిగాయి. ఇలాంటి సంఘటనలన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి అసాధ్యమైనది లేదనే విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. గురువు పట్లగల విశ్వాసం దేనినైనా ప్రసాదించగలదనే విషయాన్ని చాటిచెబుతుంటాయి.