దైవానుగ్రహాన్ని మరిచిపోకూడదు
అంకితభావంతో అహర్నిశలు కష్టపడుతూ ... దైవం యొక్క సాయాన్ని అర్ధిస్తూ ఎవరు ఏ పనిచేసినా ఆ రంగంలో రాణిస్తారు. కష్టపడే తత్త్వమున్నవారికి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ వుంటుంది. అందువలన వాళ్ల సంపాదన పెరుగుతూ వస్తుంది. ఆరంభంలో అంతా దేవుడిదయ అనిచెప్పుకునే కొంతమంది, సంపాదన పెరుగుతూ ఉండటంతో ఆ గొప్పతనం తమదేనని అనుకుంటారు.
సహజంగానే ఇలాంటివాళ్లలో అంతా తాము చెప్పినట్టే వినాలనే ధోరణి పెరిగిపోతుంది. అందుకు విరుద్ధంగా నడుచుకునే వారిపట్ల అహంభావంతో కఠినంగా వ్యవహరిస్తారు. సంపాదనని మరింత పెంచుకోవడం కోసం అసత్యాలకీ ... అవినీతికి పాల్పడతారు. సంపాదించినది అనుభవించడానికే గదా అనే ఆలోచన విలాసాలకి తెరతీస్తుంది.
విలాసాల వరకూ వెళ్లాక వ్యసనాలు అందుబాటులో వుంటాయి. వ్యసనాల బారినపడినవాళ్లు దైవారాధనకి దూరమవుతారు. అసత్యాలు ... అవినీతి ... ఆవేశం ... అహంభావం ఇవన్నీ కూడా దైవానుగ్రహానికి దూరం చేస్తాయి. ఫలితంగా అప్పటివరకూ రాణించిన రంగంపైనే పట్టుకోల్పోవడం జరుగుతుంది. అభివృద్ధి అనే నిచ్చెనపై నుంచి నష్టాలలోకి జారిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.
ఎక్కడైతే భగవంతుడి చేయి వదిలేశామో .. ఎక్కడైతే ఆయనని పట్టించుకోవడం మానేశామో .. ఎక్కడైతే నీతినియమాలకు స్వస్తి చెప్పామో అక్కడి నుంచే పతనం ఆరంభమైనట్టు తెలుస్తుంది. అలాంటప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి భగవంతుడి పాదాలను ఆశ్రయించినవారు పూర్వవైభవాన్ని పొందుతారు. లేదంటే అష్టకష్టాలతో అవస్థలు పడుతూనే వుంటారు. అందుకే జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వ్యసనాలవైపు వెళ్లకూడదు. ఎంతగా కష్టపడినా తమకృషి ఫలించడానికి కారకుడు భగవంతుడు అనే విషయాన్ని మరచిపోకూడదు.