ఎలాంటి పరిస్థితుల్లోను దైవనింద చేయకూడదు

జీవితంలో ఏది చేయకూడదు అనే ప్రశ్న వేసుకుంటే, దైవదూషణ చేయకూడదు అనేది మొదటి సమాధానంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాలు ... మహాభక్తులు అంతా ఇదే మాటను సెలవిచ్చారు. సాధారణంగా ప్రతి మనసును కోరికలు చుట్టుముడుతూనే వుంటాయి. ఆ కోరికలను నెరవేర్చుకోవడానికిగాను తమకి వీలైనంతవరకూ ప్రయత్నించి, ఆ తరువాత భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తుంటారు.

ఎలాగైనా తమ మనసులోని కోరిక నెరవేరేలా చూడమని ప్రదక్షిణలు చేస్తుంటారు .. కానుకలు చెల్లిస్తుంటారు. ఇక కొంతమంది ఆపదలో వున్న తమవారిని రక్షించమంటూ భగవంతుడిని వేడుకుంటారు. క్షేత్రదర్శనం చేస్తామనీ, మొక్కుబడులు చెల్లిస్తామని అంటారు. ఇక కోరిక నెరవేరకపోతే కొంతమంది తీవ్రమైన అసహనానికి లోనై దైవదూషణ చేస్తుంటారు. భగవంతుడి తీరును తప్పుబడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు.

అలాగే ఆపదలోవున్న తమవారి విషయంలో ఆశించిన ఫలితం కనిపించకపోతే కూడా మరికొందరు దైవనింద చేస్తుంటారు. ఎంతోకాలంగా తాము విశ్వసిస్తూ వచ్చినందుకు ఈపాటి చేయలేకపోయావు అంటూ నిందిస్తుంటారు. ధర్మబద్ధమైన కోరిక అయితే .. అది కూడా తన భక్తుడికి అవసరమని దైవం భావిస్తేనే ఆ కోరిక నెరవేరుతుంది. ఇక ఆపద విషయానికి వస్తే, ఎవరు సంపాదించుకున్న పుణ్యఫలితం వారికి రక్షణ కవచంగా మారి కాపాడుతూ వుంటుంది.

భగవంతుడు స్పందించడానికే కాదు, ఆయన మౌనం వహించడానికి కూడా కారణం వుంటుంది. ఆవేశంలోనో ... బాధలోనో ఈ విషయాన్ని మరిచిపోయి భగవంతుడిని బాధ్యుడినిచేస్తూ నానామాటలు అనకూడదు. ఒకసారి దైవనింద చేయడం వలన సంవత్సరాల తరబడి సంపాదించుకున్న పుణ్యమేదైనా వుంటే అది వెంటనే నశిస్తుంది. అంతే కాకుండా దైవనింద చేసినవారు ఉత్తమగతులను పొందే అవకాశాన్ని కోల్పోతారు. జనన మరణ చక్రంలో పదేపదే చిక్కుకుంటూ వుంటారు. అందుకే కోపంగా గానీ ... వ్యంగ్యంగా గానీ ... సరదాగా గాని భగవంతుడిని నిందించకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News