యమలోక బాధలు ఎవరికి వుండవు ?
జీవితకాలంలో ఎవరెన్ని మార్గాలలో ప్రయాణించినా, మరణానంతరం కనిపించేవి రెండే దారులు .. అవే స్వర్గం - నరకం. పుణ్యం చేసుకున్నవాళ్లంతా స్వర్గానికి, పాపాలు చేసిన వాళ్లంతా నరకానికి వెళుతుంటారు. స్వర్గం అనగానే అక్కడ కూడా హాయిగా ఉండొచ్చని అనుకునే వాళ్లంతా, నరకం అనే పేరు వినడానికి కూడా భయపడిపోతుంటారు. అందుకు కారణం నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో, వాటిని అనుభవించేవారి పరిస్థితి ఎలా వుంటుందోననే విషయం వినివుండటమే.
పాపం చేసినందుకు ... ప్రోత్సహించినందుకు ... సహకరించినందుకు ... సలహా ఇచ్చినందుకు ... చూసి కూడా ఆ నిజాన్ని చెప్పకుండా దాచినందుకు ఇలా ప్రతి పాపానికి ఒకదాని తరువాత ఒకటిగా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. వింటేనే భయానికి గురిచేసే నరకానికి వెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే, అనేక పుణ్యకార్యాలను ఆచరిస్తూ వుండాలి.
అనునిత్యం భగవంతుడిని ఆరాధిస్తూ ... దైవకార్యాలలో పాల్గొంటూ వుండాలి. గురువు పట్ల భక్తి విశ్వాసాలను కలిగి సేవిస్తూ వుండాలి. తల్లిదండ్రులను దైవసమానంగా భావిస్తూ పూజిస్తూ వుండాలి. పొరపాటున కూడా ఇలాంటివారి జోలికి వెళ్లవద్దని యమధర్మరాజు తన భటులతో చెబుతూ ఉంటాడట. అందువల్లనే దైవాన్ని ఆరాధిస్తూ .. గురువును సేవిస్తూ .. తల్లిదండ్రులను పూజిస్తూ వుండేవారికి యమలోకంలోకి అడుగుపెట్టే అవసరం రాదనీ ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. యమలోక బాధలను అనుభవించే పరిస్థితి రాదని స్పష్టం చేస్తున్నాయి.