వెతికేవారి కోసమే దేవుడు ఎదురుచూస్తుంటాడు

భగవంతుడు ఎవరి కోసం ఎదురుచూస్తూ వుంటాడు అంటే ... తనని వెతికే వారికోసం అనేది మహానుభావుల మాటగా కనిపిస్తూ వుంటుంది. ఫలానా క్షేత్రం వెళ్లి దైవదర్శనం చేసుకోవాలనుకున్న తరువాత, ఆ క్షణం కోసం భక్తులు ఆత్రుత పడుతుంటారు. అయితే అంతకన్నా ఎక్కువగా ఆ భక్తుల కోసం భగవంతుడు ఎదురుచూస్తూ వుంటాడు.

ఇలా తన గురించిన ఆలోచనచేసేవారి కోసం భగవంతుడు ఆలోచిస్తూ వుంటాడు. తనకోసం ఆరాటపడేవారికి దర్శనమివ్వడానికి ఆనందపడుతుంటాడు. ఇందుకు నిదర్శనంగా ఎన్నో మహిమాన్వితమైన సంఘటనలు కనిపిస్తూ వుంటాయి. అలాంటివాటిలో ఒకటిగా కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో జరిగిన సంఘటను చెప్పుకోవచ్చు. ప్రాచీనకాలంలోనే స్వామివారు ఇక్కడ వైభవంతో వెలుగొందిన ఆధారాలు వున్నాయి.

ఇక్కడ అర్చామూర్తిగా వున్న శ్రీమహావిష్ణువు ఒకానొక సమయంలో అదృశ్యమైపోయాడట. కొంతకాలం తరువాత ఈ ప్రదేశానికి వచ్చిన ఒక భక్తుడికి స్వామివారి లీలావిశేషాలను గురించి తెలుస్తుంది. దాంతో ఆ చుట్టుపక్కలే ఎక్కడో స్వామి ఉండవచ్చని భావిస్తాడు. ఆ స్వామి జాడ తెలుసుకుని తిరిగి ఆయనని ప్రతిష్ఠించాలానే ఉద్దేశంతో ఆ భక్తుడు అన్వేషించడం ఆరంభిస్తాడు. ఆ ప్రయత్నంలో ఆయనకి తీవ్రమైన నిరాశే ఎదురవుతుంది.

ఏంచేయాలో పాలుపోని సమయంలో ఒక రోజున ఆ భక్తుడికి స్వామివారు స్వప్నంలో కనిపించి, తానున్న ప్రదేశాన్ని తెలియపరిచాడట. స్వప్నంలో తెలిపిన ఆనవాళ్లను బట్టి ఆ భక్తుడు ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. స్వామివారి అర్చామూర్తిని వెలికితీసి తిరిగి ఇక్కడ ప్రతిష్ఠించినట్టు చెబుతారు. ఇలా ఈ శ్రీమహావిష్ణువు క్షేత్రంలో అడుగడుగునా అనేక విశేషాలు వినిపిస్తుంటాయి ... మరెన్నో మహిమలు కనిపిస్తుంటాయి.


More Bhakti News