బాధలను దూరం చేసే బాబా !
శిరిడీ అనేది ఒకప్పుడు ఒక మారుమూల గ్రామం. అది ఇప్పుడు విశ్వమంతటి విశ్వాసానికి ఆనవాలు. దేశవిదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. బాబా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. బాబాతో ఎవరికిగల అనుబంధం వారిది ... ఎవరికిగల అనుభవం వారిది. ఇక్కడి బాబాను దర్శించుకుంటే అద్దంపై దుమ్మును తుడిచేసినంత తేలికగా సమస్యలు తొలగిపోతాయనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది.
ఓదార్పును అందిస్తూ వరాలను ప్రసాదించే బాబా రూపాన్ని అనునిత్యం దర్శించాలని ఆయన భక్తులు అనుకుంటూ వుంటారు. ఈ కారణంగానే అనేక ప్రాంతాల్లో బాబా ఆలయాల నిర్మాణం జరుగుతూ వస్తోంది. అలా రూపుదిద్దుకున్న విశిష్టమైన బాబా ఆలయాల్లో ఒకటి కృష్ణాజిల్లా 'ఉయ్యూరు' లో కనిపిస్తుంది. ఇక్కడి కేసీపీ కాలనీలో గల ఈ ఆలయం చక్కగా తీర్చిదిద్దబడి వుంటుంది.
సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనసుకి హాయిగా అనిపిస్తుంది. బాబా చూపుల వాకిట్లో నిలబడితే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఎంతోమందిని కష్టాల నుంచి గట్టెక్కించిన ఆయన తమ విషయంలో ఎలా చూస్తూ కూర్చుంటాడు ? అనే భరోసా కలుగుతుంది. ఆయన వలన ఆపదల నుంచి .. అనారోగ్యాల నుంచి ... ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడినవాళ్లను చూసినప్పుడు, ఆ జాబితాలో తాను కూడా వుంటాననే ధైర్యం కలుగుతుంది.
ఏ బాధ అయినా ఆయనతో చెప్పుకోనంత వరకే. ఆ తరువాత అది కంటికి కనిపించకుండాపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. గురువారం మాత్రమే కాదు .. మిగతా రోజుల్లోనూ బాబాను దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. పర్వదినాల్లో బాబాకి ప్రత్యేక సేవలు నిర్వహిస్తుంటారు. ఈ సేవల్లో భక్తులు భారీసంఖ్యలో పాల్గొంటారు. ఆలయ అభివృద్ధికి తమకి తోచిన సాయాన్ని అందిస్తుంటారు. బాబా అనుగ్రహాన్ని పొందుతుంటారు.